Heavy Rains : మొంథా తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం, మొంథా తుఫాను గత ఆరు గంటలుగా సుమారు గంటకు 15కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఈ తుపాను ఏపీలోని మచిలీపట్నానికి 110కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ రాత్రి కాకినాడ తీరాన్ని తుఫాను తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.
Details
90 నుంచి 100 కిలోమీటర్లు వేగంలో గాలులు
తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. మొంథా తుఫాను ప్రభావంతో మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది.