Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపానుతో అనుసంధానమైన గాలుల ప్రభావం వల్ల పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చిరుజల్లులు నమోదయ్యాయి. ముఖ్యంగా కాకినాడలో ఉదయం స్వల్పంగా జల్లులు కురిసినప్పటికీ, ఉదయం 10 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఇక వాతావరణ శాఖ అధికారులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Details
ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దు
ఐదు రోజులపాటు మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి. విశాఖ తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి గణనీయంగా పెరగడంతో రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వ్యక్తం చేసింది. తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట సిబ్బందిని నియమించడంతో పాటు, సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.