Delhi CJP Protest: ఢిల్లీలో హైఅలర్ట్ ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు రద్దు.. స్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు!
ఈ వార్తాకథనం ఏంటి
'రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాం.. ఇల్లు చేరడం కూడా కష్టమైపోయింది'.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో దిల్లీలో నెలకొన్న పరిస్థితులకు ప్రయాణికుల ఇబ్బందులే నిదర్శనం. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచడంతో పాటు 170కి పైగా లోకల్, స్వల్ప దూర రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు రద్దు కావడం, రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
రైళ్లు రద్దు.. స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు పరుగులు!
గుజరాత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఘజియాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి లోకల్ రైలు ఎక్కాలని భావించాడు.
అయితే, అక్కడ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆటో, రిక్షా ద్వారా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లాక కూడా రైళ్లు రద్దయినట్లు తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
మరో ప్రయాణికుడికీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైళ్లు రద్దవుతాయన్న ముందస్తు సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.
ముందుగా లక్నో వెళ్లి, అక్కడి నుంచి మరో రైలు అందుకోవాలని ఆలోచిస్తున్నాడు. అది సాధ్యం కాకపోతే బస్సులో వెళ్లాలని భావిస్తున్నాడు.
వివరాలు
రోడ్లపైనా ట్రాఫిక్ కష్టాలు
మరోవైపు రైల్వే స్టేషన్లలోని డిస్‌ప్లే బోర్డులపై వరుసగా రైళ్లు రద్దయిన వివరాలే కనిపిస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట ప్రారంభించారు.
అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రైలు ప్రయాణికులే కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లేవారికీ ఇబ్బందులు తప్పడం లేదు.
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు.
అయితే మార్గమధ్యంలో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంతో పాటు పోలీసులు పలుచోట్ల ఆంక్షలు విధించారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ అతడిని మధ్యలోనే దించేసి వెళ్లిపోయాడు.
చేసేదేమీ లేక మరో ట్యాక్సీ కోసం వెతుక్కుంటూ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ఆ ప్రయాణికుడు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
వివరాలు
నిరసనలకు వెళ్లేవారిని మార్గమధ్యంలోనే అడ్డుకుంటున్న పోలీసులు?
రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి ఢిల్లీలో నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన మనీష్ అనే వ్యక్తికి జైపూర్ రైల్వే స్టేషన్‌లోనే పోలీసులు ఎదురయ్యారు.
ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వస్తున్న పలువురిని మార్గమధ్యంలోనే అడ్డుకుంటున్నారని, కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారని అతడికి సమాచారం అందింది.
దీంతో జంతర్ మంతర్ వద్ద నిరసన జరిగే ప్రదేశానికి ఎలా చేరుకోవాలన్న ఆందోళన నిరసనకారుల్లో కనిపిస్తోంది.
వివరాలు
నోయిడా సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా నోయిడా బోర్డర్ వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత(BNS)సెక్షన్ 223తో పాటు ఇతర సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీకి వచ్చే వారిని అడ్డుకోవడంతో పాటు అవసరమైతే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద గుమిగూడాల్సి ఉంది.
పోలీసుల ఆంక్షలు, రైళ్ల రద్దు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎంతమంది నిరసన ప్రదేశానికి చేరుకోగలరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రయాణికులు మాత్రం తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.