MP Imran Masood: వందే మాతరం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ మసూద్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం 'వందే మాతరం'ను తప్పనిసరిగా ఆలపించాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను కాంగ్రెస్ ఎంపీ 'ఇమ్రాన్ మసూద్' తీవ్రంగా వ్యతిరేకించారు. గేయం పాడే సమయంలో అందరూ నిలబడాలనే నిబంధనపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్య్రోద్యమంలో 'వందే మాతరం'కు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అయితే గేయంలోని అన్ని ఆరు చరణాలు చదవాలని చెప్పడం తాను అంగీకరించలేనని ఇమ్రాన్ మసూద్ స్పష్టం చేశారు. వందే మాతరం ఇప్పటికే పాడుతున్నాం. కానీ అన్ని చరణాలు చదవాలని చెబితే నేను చదవలేను. నా మతం దానికి అనుమతించదు.
Details
నా మతం ఏమి చెబుతుందో అదే పాటిస్తా
నాకు పార్లమెంట్ ఆవరణలో సజ్దా (ఇస్లామిక్ ప్రార్థన) చేయడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ నా మతం ఏమి చెబుతుందో అది పాటించే స్వేచ్ఛను నాకు భారత రాజ్యాంగం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి గౌరవం ఇవ్వడంలో తాను వెనుకాడనని, కానీ మత పరిమితులను దాటలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛనే ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే, వందే మాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ తప్పనిసరిగా పాడాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఏకపక్షం, నిర్హేతుకమని ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని 'ఎక్స్' వేదికగా వ్యాఖ్యానించారు.
Details
సమాజంలో విస్తృత చర్చకు దారి తీసే పరిస్థితి
వందే మాతరం పాడకుండా ముస్లింలు ఎవరినీ నిరోధించరు. అయితే గేయంలోని కొన్ని చరణాలు మాతృభూమిని దేవతలా స్తుతించేలా ఉంటాయి. ఇది ఇస్లాం వంటి ఏకదైవ మతాల ప్రాథమిక విశ్వాసాలకు విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయి. మైనార్టీల రాజ్యాంగ హక్కులను హరించే ప్రయత్నమే ఇదేనని మౌలానా అర్షద్ మదానీ పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు కేవలం రాజకీయ వాదోపవాదాలకే పరిమితం కాకుండా, సమాజంలో విస్తృత చర్చకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.