కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు
దిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థులు భయంతో కిటికీల నుంచి కిందకు దూకారు. నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 11అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థులు కిటికీల ద్వారా దూకుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 12.27 గంటలకు కాల్ వచ్చిందని, మొత్తం 11 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలం వద్ద మోహరించినట్లు దిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఎలక్ట్రిక్ మీటర్ కారణంగా మంటలు చెలరేగినట్లు అతుల్ గార్గ్ వెల్లడించారు.