ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ. 92ఏళ్ల వయసులో సలీమా ఖాన్ అనే బామ్మకు చదవుకోవాలని అనుకుంది. బామ్మ మాత్రమే వెళ్లడం కాదు, ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొంత మహిళలు లేటు వయసులో పాఠశాలకు వెళ్తుండటం గమనార్హం. సలీమా ఖాన్ 1931లో జన్మించింది. 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది. ఆమెకు చదవుకోవాలన్న ఆశ చిన్న వయసులో ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చదవడం, రాయడం అనేది ఆమె జీవితకాల కల. ఇన్నాళ్లకు ఆమె తన జీవిత కలను నెరవేర్చుకుంటూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తాను బాల్యంలో ఉన్నప్పుడు తమ గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్లే చదవుకోలేదని బామ్మ చెప్పింది.
వయసులో ఎనిమిది దశాబ్దాలు చిన్నవాళ్లతో బామ్మ చదువు
ఆరు నెలల క్రితం నుంచి బామ్మ తన కంటే ఎనిమిది దశాబ్దాలు చిన్న విద్యార్థులతో కలిసి చదువుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తన మనవడి భార్యతో పాటు పాఠశాలకు వెళ్తుండటం విశేషం. 1 నుంచి 100వరకు సలీమా ఖాన్ లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పాఠశాలకు వెళ్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. 2011జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు దాదాపు 73 శాతం. చదవుకు వయస్సుతో సంబంధం లేదని ఆమె నిరూపిస్తుందని స్థానిక విద్యా అధికారి లక్ష్మీ పాండే చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. టీచర్లు మొదట్లో ఖాన్‌కు బోధించడానికి సంకోచించినట్లు పేర్కొన్నారు. కానీ ఆమెను తిరస్కరించడానికి తమకు మనసు రాలేదని స్పష్టం చేశారు.