Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం
దిల్లీతో పాటు ఉత్తర భారతంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. దిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 100కి పైగా విమానాల సమయాన్ని రీషెడ్యూల్ చేశారు. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఆవరించి.. దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో దృశ్యమానత సున్నా ఉండగా.. ఉదయం 5.30 గంటలకు కాస్త మెరుగుపడింది. దట్టమైన పొగమంచు కారణంగా దిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
అత్యంత చల్లని ఉదయంగా రికార్డు
దిల్లీలో సోమవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినందున ఈ సీజన్‌లో ఇదే అత్యంత చల్లని ఉదయంగా నమోదైంది. లోధి రోడ్ ప్రాంతంలో కనిష్టంగా 3.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తీవ్రమైన పొగమంచు కారణంగా.. దిల్లీ విమానాశ్రయ వర్గాలు ప్రయాణీకులకు కీలక సూచనలు చేశారు. ప్రయాణికులు బయలుదేరే ముందు.. తమ విమానయాన సంస్థలను సంప్రదించవలసిందిగా కోరారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని, పొగమంచు కారణంగా విమానాలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-7 డిగ్రీల సెల్సియస్‌లో నమోదవుతున్నాయి.