
Rajnath Singh: సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయింది.. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ,సైనిక లక్ష్యాలను సాధించేందుకు కొందరు వ్యక్తులు సైబర్ దాడులను ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఈ విధానంలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కాలంలో జరుగుతున్న యుద్ధాలు,ఘర్షణలు సంప్రదాయ యుద్ధాల మాదిరిగా లేవని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు.
"రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత,మానవ జోక్యం లేకుండానే పనిచేసే వ్యవస్థలను రూపొందిస్తోంది.ఇప్పుడు చాలా విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. భూమి,సముద్రం,గగన మార్గాల్లో జరిగే సంప్రదాయ యుద్ధాల కాలం ఇప్పుడు దాటిపోయింది. సాంకేతిక ఆధారిత యుద్ధాల యుగంలోకి ప్రవేశించాం," అని అన్నారు.
వివరాలు
సంప్రదాయ యుద్ధాల కన్నా ఏ మాత్రం తక్కువ కాదు
మనం ఇప్పుడు 'గ్రే జోన్' లేదా హైబ్రిడ్ యుద్ధ శకంలో ఉన్నాం.ఇందులో రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించడానికి సైబర్ దాడులు ప్రధాన ఆయుధాలుగా మారాయి."ఒక తూటా పేల్చకుండానే ఆర్థిక యుద్ధం ద్వారా గమ్యాలను చేరుకోవచ్చు.అందుకే ఇవి సాధనాలుగా మారుతున్నాయి. సైబర్, స్పేస్ (అంతరిక్షం),సమాచారం ఆధారిత యుద్ధాలు సంప్రదాయ యుద్ధాల కన్నా ఏ మాత్రం తక్కువకాదు. వీటిని ఎదుర్కొనాలంటే మన సాయుధ దళాలన్నీ కలిసికట్టుగా, బహుళ-డొమైన్ వాతావరణంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది," అని పేర్కొన్నారు.
"మన సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి మన దేశంపై పరోక్ష యుద్ధం కొనసాగుతోంది.అక్కడి నుంచి ఉగ్రవాదం రూపంలో ముప్పు పెరుగుతోంది.ఈపరిస్థితుల్లో సైబర్ దాడులకు మనం బలికాకుండా ఉండాలంటే,మనమంతా ఏకతాటిపై చేరి సమర్థంగా పోరాడాలి,"అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.