Manipur:హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ కి విపక్ష నేతల బృందం
మణిపూర్‌లో గత కొన్ని నెలల నుండి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విపక్షాలు పార్లమెంట్ లో ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. ప్రతిపక్ష నేతల కూటమి కి సంబందించిన ఎంపీల బృందం శని, ఆదివారాల్లో మణిపూర్ పర్యటించనున్నారు . మణిపూర్ లో పరిస్థితులను అంచనా వేయడానికి పార్లమెంట్ ఉభయసభల నుంచి 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు వెళ్లనున్నారు. విపక్ష బృందం అక్కడ వివిధ వర్గాలను కలుసుకుంటారు. అలాగే కొన్ని సహాయక శిబిరాలను కూడా సందర్శిస్తారు. ఆదివారం ఉదయం మణిపూర్ గవర్నర్‌ను కలుస్తారు. మణిపూర్‌లో విపక్ష నేతల బృందం అంచనా వేసిన,అంశాలను పార్లమెంటులో చర్చిస్తారు.
విపక్ష కూటమి నుంచి మణిపూర్ కి వెళ్లే నేతలు వీరే
ఒక వేళ కేంద్ర ప్రభుత్వం విపక్షాలను మణిపూర్ వెళ్ళడానికి అనుమతించకపోతే అదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడుతామని అన్నారు. విపక్ష కూటమి నుంచి అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, సుస్మితా దేవ్, కనిమొళి కరుణానిధి, సంతోష్ కుమార్, ఏఏ రహీమ్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, జావేద్ అలీ ఖాన్, మహువా మాజి, మహమ్మద్ ఫైజల్, అనీల్ ప్రసాద్ హెగ్డే, మహమ్మద్ బషీర్, ప్రేమ్ చంద్రన్, సుశీల్ గుప్తా, అరవింద్ సావంత్, రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్, జయంత్ సింగ్, ఫూలో దేవి నేతమ్ వెళ్లనున్నారు.
మణిపూర్ ప్రజలకు మద్దతుగా ఉంటాం: కనిమొళి
మణిపూర్ కి వెళ్లేముందు డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లోని ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని భరోసా ఇస్తామన్నారు. విపక్షం తరుపు నుండి వారి కోసం పోరాడుతున్నామనిహామీ ఇస్తామన్నారు. అక్కడి గవర్నర్ ను కలిసేందుకు కూడా అనుమతి అడిగామన్నారు . మణిపూర్ లో జరిగిన హింస పై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో సమాధానం చెబుతారని ఆశిస్తున్నామన్నారు.