మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు
దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో దిల్లీ హెడ్ కానిస్టేబుల్‌ను రెండేళ్ల తర్వాత క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి సమాచారం ఆధారంగా హత్య జరిగిన రెండేళ్ల తర్వాత పోలీసులు కాలువను తవ్వి బాధితురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర అనే నిందితుడు తనకు అయినప్పటికీ, బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. బాధితురాలు పెళ్లికి నిరాకరించడంతో దిల్లీలోని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాలువలో దాచి రాళ్లతో కప్పి ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
రెండేళ్లుగా కుటంబ సభ్యులను మభ్యపెడుతూ..
ఈ హత్యలో నిందితుడి బావ, స్నేహితుడి హస్తం ఉందని స్పెషల్ సీపీ (క్రైమ్ బ్రాంచ్) రవీంద్ర యాదవ్ తెలిపారు. సురేంద్ర బావ రోవిన్ రెండేళ్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు పలు ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడని వెల్లడించారు. బాధితురాలితోపాటు తాను పరారీలో ఉన్నానని, ఆమెకు ప్రాణహాని ఉందని రోవిన్ కుటుంబీకులకు చెప్పేవాడని పేర్కొన్నారు. అతను ఆమె ఆడియో రికార్డింగ్‌ని కుటుంబ సభ్యులకు వినిపించేలా చేసినట్లు, తద్వారా ఆమె సజీవంగానే ఉందని నమ్మేలా చేసినట్లు తమ విచారణలో తేలిందని సీపీ వివరించారు. ఇదే సమయంలో నిందితుడు సురేంద్ర బాధితురాలు కటుంబ సభ్యులను పరామర్శించడానికి తరుచూ ఆమె ఇంటికి వెళ్లేవాడని చెప్పారు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకున్నట్లు వెల్లడించారు.