LOADING...
TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలకనిర్ణయం

TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాయడానికి అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కి ముందు టెట్‌ లేకుండానే ఉద్యోగంలోకి చేరిన టీచర్లకూ ఈ సదవకాశం కల్పిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం,సర్వీసులో కొనసాగాలంటే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణులు కావాలి. అదేవిధంగా,ఆ తీర్పు వెలువడిన తేదీ నుండి రెండు సంవత్సరాల గడువులోపు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

వివరాలు 

రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన  సంఘాలు 

ఐదు సంవత్సరాల్లో పదవీ విరమణ పొందబోయే టీచర్లకు ఈ నిబంధన వర్తించదని,కానీ వారు పదోన్నతులు పొందాలంటే టెట్‌ పాస్‌ కావడం అవసరమని కూడా తీర్పులో పేర్కొంది. ఇక ఈ తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసుల ఫలితాల కోసం వేచి ఉన్న ఉపాధ్యాయులకు కూడా కొంత వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ టెట్‌ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

వివరాలు 

అర్హత ప్రమాణాల్లో మార్పులేదు 

ఈసారి టెట్‌ పరీక్షకు అర్హత మార్కుల్లో ఎటువంటి సడలింపులు ఇవ్వకూడదనే నిర్ణయానికి పాఠశాల విద్యాశాఖ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభావంతులు వంటి కేటగిరీలకు డిగ్రీలో 40% మార్కులతోనే బీఈడీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అయితే టెట్‌ రాయాలంటే కనీసం 45% మార్కులు అవసరం అవుతాయి. గత కొన్నేళ్లుగా ఈ అర్హత ప్రమాణాన్ని 40%కి తగ్గించి సడలింపులు ఇచ్చినప్పటికీ, ఈసారి మాత్రం 45% మార్కుల అర్హతను తప్పనిసరి చేస్తూ శాఖ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

2011కు ముందు, తర్వాత అర్హతలు ఇలా 

రెండు రోజుల్లో విడుదల కానున్న నోటిఫికేషన్‌లో 2011కు ముందు,తరువాత నియామకాల్లో ఉన్న ఉపాధ్యాయుల విద్యార్హతల వివరాలు స్పష్టంగా పేర్కొననున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కనీస అర్హత మార్కులు ఎంత ఉండాలన్న దానిపై ఇంకా తుది స్పష్టత రాలేదు. 2011కు ముందు టెట్‌ రాయదలచిన ఎస్జీటీ అభ్యర్థులలో ఓసీలకు ఇంటర్మీడియట్‌లో కనీసం 45% మార్కులు ఉండాలి. బీసీ,ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40% మార్కులు సరిపోతాయి. 2011 తర్వాత నియామకాలకు పేపర్‌-1 (ఎస్జీటీ) రాసే ఓసీ అభ్యర్థులు సంబంధిత అర్హతలో 50% మార్కులు సాధించి ఉండాలి. బీసీ,ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,మాజీ సైనికోద్యోగులకు 45% మార్కులు ఉండాలి. పేపర్‌-2 రాసే అభ్యర్థులకూ ఇదే ప్రమాణం వర్తిస్తుంది. ఓసీలకు 50%, మిగిలిన వారికి 45% మార్కులు ఉండాలి.