Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్విహంచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు ఇంకో రెండురోజుల సమయం మాత్రమే ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు రంగుల జెండాలు రెపరెపలాడనున్నాయి. అయితే జాతీయ జెండాను ఎగరవేసేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ జెండాను ఖాదీ, సిల్క్, కాటన్ వస్త్రముతో మాత్రమే తయారు చేయాలి. జాతీయ జెండా పొడవు, వెడల్పులు 3:2నిష్పత్తిలో ఉండాలి. 300x4200 మి.మీ నుంచి 150x100 మి.మీ వరకు మొత్తం 9రకాల జెండా సైజులు ఉన్నాయి. ఈ సైజుల ప్రకారమే జెండాలు తయారు చేయాలి. చిన్నసైజులో జేబుకు పెట్టుకోవడానికి పేపర్ జెండాలు వాడవచ్చు. పెద్ద సైజులో పేపర్ జెండాలు వాడకూడదు.
రంగుల కొలతలు సమానంగా ఉండాలి
జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన కొలతల్లో ఉండాలి. తెలుపు రంగు మధ్యలో నీలిరంగులో ఉండే అశోకచక్రంలో 24ఆకులు ఉండాలి. జెండాను సూర్యోదయం అయిన తరువాత ఎగరవేయాలి. సూర్యాస్తమయం కంటే ముందే జెండాను కిందకు దించాలి. జెండాపైన ఎలాంటి రాతలు ఉండకూడదు. ఇతర జెండాలు జాతీయ జెండా పక్కన ఉన్నప్పుడు జాతీయ జెండాను కొంచెం ఎత్తులో ఉంచాలి. అలాగే ఆ జెండాల కంటే కొంచెం ముందు వరుసలో నిలబెట్టాలి. జెండాను నేలమీద పడకుండా చూసుకోవాలి. అలాగే నీళ్ళలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పై నియమాలన్నీ పాటించి జెండాను ఎగరవేయాలి.