Mohan Bhagwat: భారత్ హిందూ దేశమే.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: మోహన్ భాగవత్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని,ఇది వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన '100 వ్యాఖ్యాన్ మాల' కార్యక్రమంలో పాల్గొన్న భాగవత్, భారత సంస్కృతిని గౌరవించేంతవరకూ దేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని చెప్పారు. భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్న అభిప్రాయాన్ని భాగవత్ మరోసారి వెల్లడించారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ఉదాహరణగా పేర్కొంటూ, అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం అని, దానికి కూడా రాజ్యాంగ ఆమోదం కావాలా? అని ప్రశ్నించారు. అయితే, భవిష్యత్తులో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించి ఆ పదాన్ని చేర్చాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని అన్నారు.
వివరాలు
ఆర్‌ఎస్‌ఎస్ పై ఉన్న అపోహలపై స్పందించిన భాగవత్
అలాగే, హిందుత్వానికి కులవ్యవస్థతో సంబంధం లేదని భాగవత్ స్పష్టం చేశారు. పుట్టుక ఆధారంగా కులాలను నిర్ణయించే విధానానికి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇవ్వదని, అది హిందుత్వ లక్షణం కాదని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ పై ఉన్న అపోహలపై కూడా భాగవత్ స్పందించారు. తమ సంస్థ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. ఎవరికైనా సందేహాలుంటే తమ కార్యాలయాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసుకోవచ్చని ఆహ్వానించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలకు వ్యతిరేకమన్న భావన ఉంటే, నిజాన్ని వచ్చి స్వయంగా చూడాలని అన్నారు.
వివరాలు
ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక ప్రచారంపై విమర్శలు
ఇక, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక ప్రచారంపై కూడా ఆయన విమర్శలు చేశారు. దేశానికి, సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వెనుక కొంతమంది చెడ్డవాళ్ల భయం ఉందని, హిందూ ధర్మం ఎదుగుతుందన్న ఆందోళనతోనే ఇలాంటి ప్రచారం జరుగుతోందని అన్నారు. వదంతులు, పుకార్లకు లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలని భాగవత్ అన్నారు. అర్థం చేసుకోవాలనుకోకపోతే, ఎవరు ఎంత చెప్పినా మనసు మారదని భాగవత్ వ్యాఖ్యానించారు.