LOADING...
Russian Oil: అమెరికా మినహాయింపు ముగిసినా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు
అమెరికా మినహాయింపు ముగిసినా..రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు

Russian Oil: అమెరికా మినహాయింపు ముగిసినా.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఇంధన అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముడి చమురు దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల సడలింపు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువు ముగియడంతో ఈ అంశంపై కేంద్రం తాజా వివరణ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సోమవారం మాట్లాడుతూ.. అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో కూడా భారత్‌ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఆంక్షల్లో సడలింపులు ఇచ్చిన సమయంలోనూ అదే విధంగా దిగుమతులు కొనసాగాయని చెప్పారు.

వివరాలు 

ఆంక్షల సడలింపు ఉన్నా లేకున్నా దేశ ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదు 

ప్రస్తుతం కూడా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని వెల్లడించారు. ఏ దేశం నుంచి చమురు కొనాలన్నది పూర్తిగా భారత వాణిజ్య అవసరాలు, ఇంధన భద్రత ఆధారంగానే నిర్ణయిస్తామని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఆంక్షల సడలింపు ఉన్నా లేకున్నా దేశ ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దేశంలో ముడి చమురు కొరత లేదని కూడా ఆమె తెలిపారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌తో పాటు మరికొన్ని దేశాలకు అమెరికా తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో స్పష్టత

అయితే ఇప్పటికే సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు జరపాలని అప్పట్లో అమెరికా స్పష్టం చేసింది. ఆ మినహాయింపు గడువు మే 17తో ముగియడంతో భారత్‌లో చమురు సరఫరాపై మరోసారి చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. కెప్లెర్‌ గణాంకాల ప్రకారం మే నెలలో ఇప్పటివరకు భారత్‌ రోజుకు సగటున 23 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.

Advertisement