 
                                                                                India China flights: ఐదేళ్ల తర్వాత భారత్-చైనా విమాన సర్వీసులు పునః ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత భారత్, చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ నిర్వహించిన తొలి విమానం, 176 మంది ప్రయాణికులతో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి నిన్న బయలుదేరింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు సంకేతంగా భావిస్తున్నారు. వివరాల ప్రకారం, 2020 మార్చి వరకు భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం,అనంతరం తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేశాయి. దాని ఫలితంగా ద్వైపాక్షిక విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.
వివరాలు
ఇటీవలి పరిణామాలతో ఇరుదేశాల మధ్య మెరుగుపడిన ద్వైపాక్షిక సంబందాలు
ఇటీవలి నెలల్లో ఇరుదేశాల అధికారులు పలు దఫాలు చర్చలు జరిపి, సర్వీసుల పునఃప్రారంభంపై ఒప్పందానికి వచ్చారు. ఈ చర్చలు ఫలప్రదమవడంతో, ఇరు ప్రభుత్వాలు విమానాలను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించాయి అని భారత విదేశాంగశాఖ ఇటీవల ప్రకటించింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా, మొదటి విమానం కోల్‌కతా నుంచి చైనాకు ప్రయాణించింది. ఈ సర్వీసుల పునరుద్ధరణతో వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులు మరింత సౌలభ్యంగా ప్రయాణించగలరని అధికారులు పేర్కొన్నారు.