LOADING...
Operation Sagar Bandhu: శ్రీలంక నుండి సురక్షితంగా భారత్‌కు 400 మంది భారతీయులు 
శ్రీలంక నుండి సురక్షితంగా భారత్‌కు 400 మంది భారతీయులు

Operation Sagar Bandhu: శ్రీలంక నుండి సురక్షితంగా భారత్‌కు 400 మంది భారతీయులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దిత్వా తుఫాను శ్రీలంకను తీవ్రంగా అతలాకుతలం చేసింది.ముసురుకొట్టిన భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారమైన ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పరిస్థితి చేయి దాటడంతో అక్కడి ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోగా,మరో 300 మందికి సంబంధించి ఆచూకీ లభించని పరిస్థితి కొనసాగుతోంది. బాధితులను సురక్షితంగా రక్షించేందుకు శ్రీలంక స్థానిక అధికారులతో కలిసి భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. విపత్తును ముందుగానే అంచనా వేసిన భారత్ 'ఆపరేషన్ సాగర్ బంధు'ను ప్రారంభించి, నిరాశ్రయులకు అత్యవసర సరుకులు,ఆహారం,ఔషధాలను అందించింది. వరదల వల్ల అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి చేర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి,వేగంగా అమలు చేసింది.

వివరాలు 

విమానం ఎక్కే ముందు భావోద్వేగంతో 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు

ఈ చర్యల్లో భాగంగా, రెండు రోజుల వ్యవధిలో కొలంబోలో చిక్కుకుపోయిన సుమారు 400 మందికిపైగా భారతీయులను విజయవంతంగా భారత్‌కు తరలించారు. 'ఆపరేషన్ సాగర్ బంధు'లో చివరి విడత ప్రయాణికులు విమానం ఎక్కే ముందు భావోద్వేగంతో 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనను శ్రీలంకలో భారత హైకమిషన్ అధికారికంగా ధృవీకరించింది. భారత హైకమిషనర్ సంతోష్ ఝా స్వయంగా బండారునాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, స్వదేశానికి వెళ్తున్న చివరి బృందం ప్రయాణికులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తుఫాను కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

వివరాలు 

మొత్తం 400 మందికిపైగా భారతీయులను భద్రంగా స్వదేశానికి..

సురక్షిత తరలింపునకు భారత వైమానిక దళం ప్రత్యేక విమానాలు అయిన C-130J, IL-76లను వినియోగించింది. అందిన వివరాల ప్రకారం మొత్తం 400 మందికిపైగా భారతీయులను భద్రంగా స్వదేశానికి తీసుకొచ్చారు. ఇందులో సుమారు 150 మందిని దిల్లీ (హిండన్ ఎయిర్‌బేస్)కు, మరో 250 మందిని తిరువనంతపురం (కేరళ)కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ విమానాలు మొదట శ్రీలంకకు తుఫాను బాధితుల కోసం సహాయక సామగ్రి, మానవతా సహాయాన్ని చేరవేయడానికి వెళ్లాయి. అనంతరం అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు ఉపయోగించబడ్డాయి. వీలైనంత త్వరగా ప్రతి భారత పౌరుడిని స్వదేశానికి చేర్చాలనే లక్ష్యంతో వాణిజ్య విమాన సంస్థలు, భారత వైమానిక దళం పరస్పరం సమన్వయంతో నిరంతరంగా కృషి చేశాయి.

Advertisement