Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కలరా మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. కలరాతో ఆ దేశంలో ఇప్పటి వరకు 600 మంది చనిపోయారు. అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాంబియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభం కావడం గమనార్హం. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు దేశంలో 15,000 మందికి పైగా కలరా సోకింది. జాంబియాలోని 10 ప్రావిన్సులు ఉంటే, తొమ్మిదింటిలో కలరా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలో బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం స్డేడియాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాట చేసింది.
జాంబియాకు అండగా నిలిచిన భారత్
ఈ కష్ట కాలంలో జాంబియా దేశానికి భారత్ అండగా నిలిచింది. జాంబియాకు మానవతా సాయాన్ని పంపింది. సుమారు 3.5 టన్నుల బరువున్న ఈ సాయంలో నీటి శుద్దీకరణ సామాగ్రి, క్లోరిన్ మాత్రలు, ORS సాచెట్ల ఉన్నాయి. ఇదిలా ఉంటే, కలరాను అరికట్టేందుకు ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. జాంబియాలోని బాధిత వర్గాలకు అధికారులు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశంలోని రిటైర్డ్ ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.