మాల్దీవులకు షాకిచ్చిన భారత పర్యాటకులు.. 2023లో మనమే టాప్.. ఇప్పుడు 5వ స్థానానికి..
భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్రంగా పడిందని చెప్పాలి. మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతకుముందే మాల్దీవులను సందర్శించే దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. గత మూడు వారాల్లో ఐదో స్థానానికి చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులదే అగ్రస్థానం. ఇప్పుడు అది ఐదోస్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ మూడు వారాల్లో మాల్దీవులను సందర్శించిన భారతీయుల వాటా కేవలం 8శాతం మాత్రమే కావడం గమనార్హం.
విమాన బుకింగ్‌లు రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా ముగ్గురు మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఈ క్రమంలో భారత్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆ ముగ్గురు మంత్రులను మాల్దీలవుల ప్రభుత్వం తొలగించింది. ఇదే సమయంలో పర్యాటక పరంగా మాల్దీవులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. చాలా ట్రావెల్ ఏజెన్సీలు మాల్దీవులకు విమాన బుకింగ్‌లను రద్దు చేశాయి. #BoycottMaldives సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దీంతో చాలా మంది భారతీయులు తమ మాల్దీవుల బుకింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఈ వ్యవహారం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావం పడింది.
మాల్దీవులను సందర్శించే టాప్-10 దేశాల జాబితా
1. రష్యా: 18,561 మంది (10.6% మార్కెట్ వాటా) 2. ఇటలీ: 18,111 మంది (10.4% మార్కెట్ వాటా) 3. చైనా: 16,529 మంది (9.5% మార్కెట్ వాటా) 4. యూకే: 14,588 మంది (8.4% మార్కెట్ వాటా) 5. భారత్ : 13,989 మంది (8.0% మార్కెట్ వాటా.. 2023లో భారత్ వాటా 11శాతంతో మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి తగ్గింది) 6. జర్మనీ: 10,652 మంది (6.1% మార్కెట్ వాటా) 7. అమెరికా: 6,299 మంది (3.6% మార్కెట్ వాటా) 8. ఫ్రాన్స్: 6,168 మంది (3.5% మార్కెట్ వాటా) 9. పోలాండ్: 5,109 మంది(2.9% మార్కెట్ వాటా) 10. స్విట్జర్లాండ్: 3,330 మంది (1.9% మార్కెట్ వాటా)