Putin: 'భారత్ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారు'.. మోదీ సుదృఢ నేత: పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, రష్యా బంధం ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ బంధం రెండు దేశాల స్వంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు మాత్రమేనని తెలిపారు. భారత్ పర్యటన సందర్భంగా ఆయన 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూ గురువారం ప్రసారం అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ వేగంగా ఎదుగుతున్న తీరాన్ని కొందరు సహించలేకపోతున్నారని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని, భారత ప్రభావాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ కారణాలతో కృత్రిమ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు భారత్-రష్యాల మధ్య ఇంధన వాణిజ్యంపై పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.
వివరాలు
వాటికీ త్వరలో పరిష్కారం చూపేందుకు చర్యలు
బయటి నుంచి ఒత్తిళ్లు వచ్చినా తానైనా, ప్రధాని మోదీ అయినా ఈ బంధాన్ని ఎవరికీ వ్యతిరేకంగా ఉపయోగించుకోలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వంత ఎజెండా, ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ, తాము మాత్రం తమ లక్ష్యాల కోసమే పనిచేస్తున్నామని, అవి ఎవరికీ వ్యతిరేకం కావని అన్నారు. ఇప్పటికే భారత్ - రష్యాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలలో సుమారు 90 శాతం రెండు దేశాల స్థానిక కరెన్సీల్లోనే జరుగుతున్నాయని పుతిన్ వెల్లడించారు. మిగిలిన 10 శాతం లావాదేవీల్లో కొన్ని మధ్యవర్తిత్వ సంస్థల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటికీ త్వరలో పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా అభ్యంతరాలకు పుతిన్ గట్టిగా స్పందించారు.
వివరాలు
భారత్ కొంతవరకూ చమురు దిగుమతులు తగ్గించింది
రష్యా చమురును కొనుగోలు చేసే హక్కు అమెరికాకుంటే అదే హక్కు భారత్‌కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అణు ఇంధన అవసరాల కోసం ఇప్పటికీ అమెరికా తమవద్ద నుంచే అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో గడిచిన తొమ్మిది నెలల్లో భారత్ కొంతవరకూ చమురు దిగుమతులు తగ్గించిందన్నది వాస్తవమేనని పుతిన్ అంగీకరించారు. అయితే అది స్వల్ప సర్దుబాటు మాత్రమేనని, మొత్తంగా ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఒత్తిళ్లకు లొంగని మోదీ
'గతంలో భారత్‌ను చూసినట్లు ఇప్పుడు చూడలేరు. ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకూ తలొగ్గని నాయకుడని తెలిపారు. ఆయన నాయకత్వాన్ని చూసి భారత ప్రజలు గర్వించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ వైఖరి ఎంతో దృఢంగా, స్పష్టంగా ఉంటుందని, అనవసరంగా ఎవరికీ ఎదురు నిలబడే స్వభావం మాత్రం కాదని వివరించారు. తమ లక్ష్యం ఘర్షణలను ప్రోత్సహించడం కాదని, చట్టబద్ధ హక్కులను కాపాడుకోవడమేనని అన్నారు. భారత్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు.
వివరాలు
ఒత్తిళ్లకు లొంగని మోదీ
దేశం కోసం కఠిన నిర్ణయాలతో కూడిన కార్యక్రమాలను మోదీ ముందుండి నడుపుతున్నారని, ముందుగా తానే బాధ్యత తీసుకుని తర్వాతే వ్యవస్థను భాగస్వామిని చేస్తున్నారని తెలిపారు. భారత్ అదనంగా ఎస్-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే అంశంపై మాత్రం పుతిన్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే రష్యా కేవలం రక్షణ పరికరాలను మాత్రమే భారత్‌కు విక్రయించడం కాదు, ఆధునిక సాంకేతికతను కూడా పంచుకుంటోందని తెలిపారు.