LOADING...
Thailand-Cambodia clashes: థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక
థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక

Thailand-Cambodia clashes: థాయిలాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్,కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, థాయ్‌లాండ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరికీ ముఖ్యమైన ప్రయాణ సూచనను విడుదల చేసింది. ఈ సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇప్పటికే ప్రాణ నష్టం సంభవించిందని తెలిపింది. ఒక సైనికుడితో పాటు, 15 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఈ ఘర్షణల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రస్తుత అస్థిర పరిస్థితుల దృష్ట్యా, భారత పౌరులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ప్రత్యేకంగా, థాయ్‌లాండ్‌కు ప్రయాణించాలనుకునే వారు కొన్ని జిల్లాలకు తమ ప్రణాళికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరింది.

వివరాలు 

ఈ ఏడు ప్రావిన్స్‌లకు ప్రయాణించకూడదని సూచన

ఈ మేరకు, థాయ్‌లాండ్‌లోని ఏడు ముఖ్యమైన ప్రావిన్స్‌లకు ప్రయాణించకూడదని భారత రాయబార కార్యాలయం సూచించింది. వాటిలో ఉబోన్ రాచతాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కేవో, చాంతబురి, ట్రాట్ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కంబోడియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కావడంతో, అక్కడ ఘర్షణలు ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇటీవలి ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా థాయ్‌లాండ్‌లో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు కారణమని తెలుస్తోంది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి.

వివరాలు 

థాయ్‌లాండ్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయాలు

థాయిలాండ్ ఈ పేలుడుకు కంబోడియాను నిందించగా.. కంబోడియా మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇది పాత ల్యాండ్‌మైన్ వల్ల జరిగినదై ఉండవచ్చని కంబోడియా వాదించింది. ఈ పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచాయి. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్న ఆందోళనతో థాయ్‌లాండ్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. కంబోడియాలోని తమ రాయబారిని తిరిగి పిలిపించుకుంది. అదేవిధంగా, థాయ్‌లాండ్‌లో ఉన్న కంబోడియా రాయబారిని కూడా బయటకు పంపించింది.

వివరాలు 

రెండు దేశాల మధ్య ఉన్న అన్ని సరిహద్దు చెక్‌పోస్టులు మూసివేత 

ఇంతటితో ఆగకుండా, రెండు దేశాల మధ్య ఉన్న అన్ని సరిహద్దు చెక్‌పోస్టులు మూసివేసింది. కంబోడియాలో ఉన్న థాయ్‌లాండ్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని థాయ్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున ఆయుధాలను ఉపయోగిస్తున్నారని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీని వల్ల పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో, తమ భద్రతను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం మరోసారి స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.