Junk Food Curbs Near Schools: స్కూళ్లకు 50 మీటర్లలో జంక్‌ఫుడ్ అమ్మకాలపై ఆంక్షలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో పాఠశాలల సమీపంలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర (HFSS) ఉన్న జంక్‌ఫుడ్ విక్రయాలపై ఆంక్షలు విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించిన ఈ నిబంధనల ప్రకారం పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో ఇటువంటి ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించే అవకాశం ఉంది. దేశంలోని సుమారు 15 లక్షల పాఠశాలల చుట్టూ ఉన్న చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్లపై దీని ప్రభావం పడొచ్చు. పెప్సికో, కోకాకోలా, మాండలీజ్, నెస్లే వంటి పెద్ద ఆహార, పానీయ సంస్థలకు కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
వివరాలు
పిల్లల ఆరోగ్యమే లక్ష్యం.. FSSAI కొత్త నిబంధనల వెనుక కారణమిదే..
చిన్న వయసులోనే పిల్లల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరగకుండా చూడటమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని FSSAI సీఈఓ రాజిత్ పున్హానీ తెలిపారు.
అయితే HFSS కేటగిరీలోకి రాని ఆహార పదార్థాలను దుకాణదారులు విక్రయించుకోవచ్చని, కాబట్టి వ్యాపారాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఆయన చెప్పారు.
ఆహార తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేలా ఈ నిబంధనలు ప్రోత్సహిస్తాయని తెలిపారు.
2020లోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ.. అమలుకు ఇప్పటివరకు నిర్దిష్ట గడువు లేదు. ప్రజల నుంచి అక్టోబర్ 6 వరకు అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు.
వివరాలు
ప్రపంచ దేశాల తరహాలో భారత్‌లోనూ జంక్‌ఫుడ్‌పై నిబంధనలు
భారత్‌లో 5-19 ఏళ్ల వయసున్న అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారి సంఖ్య 2015లో 2.8కోట్ల నుంచి 2025లో 4.1కోట్లకు పెరిగినట్లు వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ డేటాను రాయిటర్స్ పేర్కొంది.
2040 నాటికి ఇది 5.6 కోట్లకు చేరొచ్చని అంచనా. ఇక మహారాష్ట్ర మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో HFSS ఉత్పత్తులను దుకాణాల్లో ఉంచకూడదని రాష్ట్రం ప్రతిపాదించింది.
చిలీ, మెక్సికో వంటి దేశాల తరహాలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లను కూడా భారత్ పరిశీలిస్తోంది.
చిలీలో 2016లో అమలు చేసిన నిబంధనల తర్వాత ఆహార సంస్థలు పలు ఉత్పత్తులను మార్చడంతో పాటు, పిల్లల్లో అధిక బరువు సమస్య తగ్గినట్లు అధ్యయనాలు సూచించాయి.