India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసి ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సహకారం కొత్త స్థాయికి చేరుతాయని అధికారులు భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో కేవలం 9 నెలల్లోనే ఈ ఒప్పందాన్ని పూర్తి చేశారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 2025 మార్చిలో భారత్‌కు వచ్చిన సందర్భంగా ఎఫ్‌టీఏపై కీలక చర్చలు జరిగాయి.
వివరాలు
మోదీ-లక్సన్ ఫోన్ చర్చల తర్వాత ప్రకటన
సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడింది. చర్చల తర్వాత లక్సన్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "న్యూజిలాండ్-భారత్ ఎఫ్‌టీఏ పూర్తైన తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు మేము చేసే 95 శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిపోతాయి. వాణిజ్యం పెరగడం అంటే న్యూజిలాండ్‌లో మరిన్ని ఉద్యోగాలు, మంచి జీతాలు, కష్టపడే ప్రజలకు కొత్త అవకాశాలు" అని తెలిపారు.
వివరాలు
ఈ ఒప్పందంతో లాభాలేంటి?
రాయిటర్స్ కథనం ప్రకారం, ఈ ఒప్పందం కింద భారత్‌కు వెళ్లే న్యూజిలాండ్ ఎగుమతుల్లో 95 శాతం ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతోంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే సగానికి పైగా ఉత్పత్తులు పూర్తిగా సుంకం లేకుండా భారత్‌కు చేరనున్నాయి. దీని వల్ల భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి మార్కెట్‌కు న్యూజిలాండ్ ఉత్పత్తులు సులభంగా చేరతాయి. అదే సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న భారత్ మార్కెట్‌తో పాటు 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారబోయే దేశంతో వ్యాపారం చేయడం న్యూజిలాండ్ ఎగుమతిదారులకు మరింత సులభం కానుంది.