Vladimir Putin: పుతిన్ పర్యటనలో రష్యాతో ఆయుధ డీల్స్‌పై భారత్ చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న నేపథ్యంలో, రష్యాతో కీలక ఆయుధ ఒప్పందాలపై చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలు, అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500 షీల్డ్‌పై చర్చలు జరగనున్నట్లు సమాచారం. భారత్-రష్యాల మధ్య కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొనసాగింపుగానే ఉండగా, రష్యాతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటు అమెరికాతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మాస్కోతో సంప్రదాయ బంధాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారు.
వివరాలు
సైనిక సామగ్రి సరఫరాలో రష్యానే అతిపెద్ద భాగస్వామి
అయితే ఇటీవల సంవత్సరాల్లో రష్యా ఆయుధాల కొనుగోళ్లపై భారత్ ఆధారాన్ని కొంత మేర తగ్గించినప్పటికీ, ఇప్పటికీ సైనిక సామగ్రి సరఫరాలో రష్యానే అతిపెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. రక్షణ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రష్యాతో రక్షణ సహకారం దీర్ఘకాలికమైనదేనని, భారత్ భవిష్యత్‌లోనూ రష్యా, అమెరికా దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్ వద్ద 200కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు, ఎస్-400 రక్షణ వ్యవస్థలు ఉండగా, వీటిని మే నెలలో పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణ సమయంలో ఉపయోగించినట్లు సమాచారం.
వివరాలు
ఆధునిక రష్యన్ విమానాల కొనుగోళ్లు
యుద్ధ విమానాల కొరత నేపథ్యంలో మరిన్ని ఆధునిక రష్యన్ విమానాల కొనుగోళ్లకు ఎయిర్‌ఫోర్స్ ప్రభుత్వాన్ని కోరిందని వర్గాలు వెల్లడించాయి. సుఖోయ్-57లాంటి విమానాలకు భారత పైలట్ల మార్పు సులభమవుతుందని, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాటి నిర్వహణకు సిద్ధమని పేర్కొన్నారు. అయితే పుతిన్ పర్యటనలోనే కొత్త ఒప్పందాలు తుది దశకు చేరుకునే అవకాశం మాత్రం లేదని వర్గాలు స్పష్టం చేశాయి.