Loading...
PM Modi: విపక్షాల తీరుపై మోదీ విమర్శలు.. జీటీఏ గేమ్‌తో పోలిక
విపక్షాల తీరుపై మోదీ విమర్శలు.. జీటీఏ గేమ్‌తో పోలిక

PM Modi: విపక్షాల తీరుపై మోదీ విమర్శలు.. జీటీఏ గేమ్‌తో పోలిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశం ఇప్పుడు పాత ఆలోచనలు, పాత విధానాలను పక్కనపెట్టి సరికొత్త లక్ష్యాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 'వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూత్' పేరుతో నిర్వహించిన వర్క్‌షాప్‌ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాల తీరును ప్రముఖ వీడియో గేమ్ 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో' (జీటీఏ)తో పోల్చారు.

వివరాలు 

టెక్నాలజీని వాడుకుని ఫేక్ వీడియోలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని ఆరోపణ

వీడియో గేమ్‌ల గురించి తెలిసిన వారికి జీటీఏ ఆట గురించి కూడా తెలుసని మోదీ పేర్కొన్నారు.

ఆ గేమ్‌లో ఆటగాడికి అపరిమిత స్వేచ్ఛ ఉంటుందని, నచ్చిన పని చేయడం, ఇతరుల వస్తువులను లాక్కోవడం, విధ్వంసం సృష్టించడం వంటివి చేయవచ్చని వివరించారు.

ప్రస్తుతం కొందరు వ్యక్తులు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

సాంకేతికతను ఉపయోగించుకుని వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారాలు చేస్తున్నారని, నకిలీ వీడియోలతో తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

వివరాలు 

యువత ఆలోచనలు, సృజనాత్మకత దేశాభివృద్ధికి దోహదపడాలి

రాజకీయ శత్రుత్వంతో కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు దేశ ప్రజల మనోధైర్యాన్ని,జాతీయ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వారు అన్ని హద్దులనూ దాటుతున్నారని విమర్శించారు.రాజకీయ విభేదాల పేరుతో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం సరికాదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

మరోవైపు, భారత్ ఇప్పుడు పాత పద్ధతులను విడిచిపెట్టి సరికొత్త దిశగా అడుగులు వేస్తోందని మోదీ పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి యువకుడు కొత్త ఆశయాలతో, స్పష్టమైన లక్ష్యాలతో ఆలోచించాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా దేశం కూడా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటోందని, నేటి భారత్‌కు కొత్త లక్ష్యాలు, కొత్త నియమాలు ఉన్నాయని చెప్పారు.

యువత ఆలోచనలు, సృజనాత్మకత దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.

ADVERTISEMENT

వివరాలు 

రాబోయే 25 ఏళ్లు భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన 'అమృత కాలం'

రాబోయే 25 ఏళ్లు భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన 'అమృత కాలం' అని ప్రధాని వివరించారు.

2047లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ వర్క్‌షాప్‌లో గవర్నర్లు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.

దేశ నిర్మాణానికి ఉపయోగపడే వినూత్న ఆలోచనలు, సూచనలను ప్రత్యేక పోర్టల్ ద్వారా పంచుకోవాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT