India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన పలు నిర్మాణాత్మక సంస్కరణల ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం రూ.4 వేల కోట్ల మార్కును దాటిందని వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ఇండియా పోస్ట్ 2026-27 వార్షిక వ్యాపార తొలి త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇండియా పోస్ట్‌కు రూ.19,803 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పెమ్మసాని తెలిపారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ రూ.233.56 కోట్ల ఆదాయం
ఇందులో తొలి త్రైమాసికానికి రూ.4,950 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా, రూ.4,008 కోట్ల ఆదాయం నమోదైందన్నారు.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 22శాతం అధికమని పేర్కొన్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కు తొలి త్రైమాసికంలో రూ.229.93కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు.
అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.233.56 కోట్ల ఆదాయం నమోదు చేసి,నిర్దేశిత లక్ష్యాన్ని 102 శాతం మేర అధిగమించిందని వెల్లడించారు.
తెలంగాణకు తొలి త్రైమాసికంలో రూ.224.13 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా, అక్కడ రూ.157.78 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైందన్నారు.
ఆదాయ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా తొలి స్థానంలో నిలవగా,తెలంగాణ 22వ స్థానంలో నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.