LOADING...
India: భారత్‌ పోర్టులపై అమెరికా వినియోగం అంటూ వార్తలు వైరల్‌.. కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ
కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ

India: భారత్‌ పోర్టులపై అమెరికా వినియోగం అంటూ వార్తలు వైరల్‌.. కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆసియా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు వార్తలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా భారతదేశంలోని పోర్టులను ఉపయోగిస్తోందని ఒక అమెరికా మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA Fact Check)తన ఫ్యాక్ట్ చెక్‌లో స్పష్టం చేసింది. అమెరికా సైన్యంలో మాజీ కల్నల్‌గా పనిచేసిన డగ్లస్ మెక్‌గ్రెగర్ ఒక అమెరికన్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అందువల్ల సమీపంలోని భారత నౌకాదళ స్థావరాలను అమెరికా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

పూర్తిగా తప్పుడు,నకిలీ ఆరోపణలే: విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం

అయితే ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం, ఇవన్నీ పూర్తిగా తప్పుడు,నకిలీ ఆరోపణలేనని తెలిపింది. ఇలాంటి కల్పిత, ఆధారరహిత వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది. ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారం బయటకు రావడం చర్చనీయాంశమైంది.

వివరాలు 

ఐరిస్ దేనా-75 యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 అనే యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచివేసిన ఘటన తెలిసిందే. దాడి జరిగిన సమయంలో ఆ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారిలో కొందరిని శ్రీలంక సైన్యం రక్షించగా, 87 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నౌక విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్తుండగా శ్రీలంక తీర ప్రాంతానికి సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement