India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భారత్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్‌కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తాజాగా వెల్లడించారు. ఈ మండలిలో సభ్యత్వానికి సంబంధించి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలిస్తున్నామని,దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, ఫిబ్రవరి 19న జరగనున్న ఈ శాంతి మండలి తొలి సమావేశానికి భారత్ హాజరవుతుందా? లేదా? అన్న విషయంపై కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం.. భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం చేపట్టే ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని రణధీర్ జైస్వాల్ మరోసారి పునరుద్ఘాటించారు. గాజాతో పాటు మొత్తం ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనేలా చేసే అన్ని కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. గత నెల స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఈ 'శాంతి మండలి'ని ట్రంప్ అధికారికంగా ప్రారంభించారు. గాజా ప్రాంతంలో శాంతి నెలకొల్పే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మండలికి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
వివరాలు
మోదీ రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్ వ్యాఖ్యల వీడియో.. స్పందించిన భారత్
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ జీవితం గురించి గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ అంశంపై కూడా రణధీర్ జైస్వాల్ స్పందించారు. "నేను ఆ వీడియోను ఇప్పటివరకు చూడలేదు. అయితే అది నిజమైనదైనా, కల్పితమైనదైనా.. వాస్తవాలు నిర్ధారణ అయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు. గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశంపై భారత్‌పై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు: ట్రంప్
ఆ సమయంలో వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్,ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆయన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో "ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు"అని వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ఆ పాత వ్యాఖ్యల వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.