Bihar: బీహార్ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య
వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) పార్టీ అధినేత, బిహార్ ప్రభుత్వ మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. పదునైన ఆయుధంతో ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు చెబుతున్నారు. అయన మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించింది. దర్భంగా ఎస్‌ఎస్పీ జగనాథ్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. జితన్ సాహ్ని మృతదేహాన్ని ఇంటి నుండి ఛిద్రమైన స్థితిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. జితన్ సాహ్ని ఇల్లు దర్భంగాలోని సుపాల్ బజార్‌లోని అఫ్జ్లా పంచాయితీలో ఉంది.
హత్యపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు
నివేదిక ప్రకారం, జితన్ సాహ్నిని పదునైన ఆయుధంతో ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. మృతదేహం కనిపించిన గది చుట్టూ రక్తం కారుతోంది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మొత్తం వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. హత్యపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఎస్పీ దేహత్ (దర్భంగా) నేతృత్వంలో సిట్ కేసును దర్యాప్తు చేస్తుంది. ఎస్పీ దేహత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం దీనిపై విచారణ చేపట్టనుంది. ముఖేష్ సాహ్ని ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తండ్రి హత్య వార్త తెలియగానే ముంబై నుంచి పాట్నా బయలుదేరారు.
దొంగతనం కోణం బయటపడింది!
ముఖేష్ సాహ్ని పూర్వీకుల ఇల్లు దర్భంగాలోని సుపాల్ మార్కెట్‌లో ఉంది.ఈ ఇంట్లో అతని తండ్రి జీతన్ ఒంటరిగా ఉండేవాడు. ముఖేష్ సాహ్ని తల్లి చాలా కాలం క్రితం మరణించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రాత్రి కొందరు వ్యక్తులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో జితన్ సాహ్ని ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై జీతన్ నిరసన తెలపడంతో దుండగులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురైనట్లు తెల్లవారుజామున సమాచారం అందిందని బిరౌల్ SDPO మనీష్ చంద్ర చౌదరి చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించగా,ఎవరో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ దాడిలో జీతన్ సహాని మరణించాడు.