power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది. 2023 ఏప్రిల్- నవంబర్ మధ్య విద్యుత్ వినియోగం 1,099.9 బిలియన్ యూనిట్ల(BU)కు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలపరిమితితో పోలిస్తే భారీగా పెరుగుదల నమోదైంది. విద్యుత్ వినియోగంలో ఈ పెరుగుదల దేశంలోని ఆర్థిక కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని సూచిస్తుందని నిపుణలు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం 1,504.26 బీయూకు పెరిగింది. అంతకుముందు ఏడాది అంటే 2021-22లో 1,374.02 బీయూ మాత్రమే నమోదైంది.
విద్యుత్ వినియోగం ఎందుకు పెరిగిందంటే..
విద్యుత్ వినియోగం ఏప్రిల్, మే, జూన్‌లో భారీగా పెరిగింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా విద్యుత్ వినియోగం ఎక్కువైంది. పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం మరో కారణం. వేసవిలో విద్యుత్ మంత్రిత్వ శాఖ గరిష్టంగా 229GW డిమాండ్‌ను అంచనా వేసినప్పటికీ, అకాల వర్షం కారణంగా జూన్‌లో 224.1GW, జూలైలో 209.03GW తగ్గింది. ఆగస్టు నుంచి డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదైంది. ఆగస్టులో గరిష్టంగా 238.82GW, సెప్టెంబర్‌లో 243.27GWకు వినియోగం పెరిగింది. 2013-14 నుంచి 2022-23 వరకు ఇంధన పరంగా దేశంలో విద్యుత్ డిమాండ్ 50.8శాతం పెరిగిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ లోక్‌సభకు తెలిపారు.