Amarawathi: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లు.. 14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విజయవాడలోని మేధాటవర్స్‌లో ఏర్పాటు అవుతున్నాయి. వీటిని భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ (బీక్యూఆర్‌ఎఫ్)గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో దేశీయ సాంకేతికతతో తయారైన రెండు చిన్న క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఆలోచనకు రూపం ఇచ్చిన తర్వాత,ఆ రంగంలో నైపుణ్యం ఉన్న దేశీయ,విదేశీ నిపుణులతో ఏర్పడిన క్యూబిట్ ఫోర్స్ సంస్థ ఈ కంప్యూటర్లను రూపొందించింది.
వివరాలు
'అమరావతి 1క్యూ' పేరుతో మరో కంప్యూటర్
ప్రభుత్వరంగ రక్షణ, శాస్త్రసాంకేతిక సంస్థలు, ప్రైవేటు సంస్థలు కలిసి కీలక హార్డ్‌వేర్‌ను తయారు చేశాయి. టీఐఎఫ్‌ఆర్ ముంబయి, ఐఐఎస్‌సీ బెంగళూరు, డీఆర్‌డీఓ పుణె, ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్, దిమిరా వంటి సంస్థలు భాగస్వామ్యంగా పనిచేశాయి. ఎస్‌ఆర్‌ఎంలో 'అమరావతి 1ఎస్' పేరుతో కంప్యూటర్‌ను క్యూబిట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండగా, మేధాటవర్స్‌లో 'అమరావతి 1క్యూ' పేరుతో మరో కంప్యూటర్‌ను క్యూబిటెక్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. 2025 ఆగస్టులో ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ ఆలోచనకు కేవలం ఎనిమిది నెలల్లో ఈ స్థాయి పురోగతి సాధించడం విశేషం.
వివరాలు
క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీకి ఊతం
అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్లతో పాటు భవిష్యత్తులో పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు, విడిభాగాలను ఇక్కడే తయారు చేసి ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి హార్డ్‌వేర్ తయారీదారులతో సమావేశమై, టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక రిఫరెన్స్ సదుపాయాల అవసరాన్ని గుర్తించారు. ఇప్పుడు ఈ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో దేశంలోని అనేక సంస్థలు అమరావతిలోనే తయారీకి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రాసెసర్‌లను పరీక్షించడానికి విదేశాలకు పంపాల్సి వస్తుండగా, దీనికి ఆరు నెలల వరకు సమయం పడుతోంది. కొన్ని దేశాలు టెస్టింగ్‌కు అనుమతులు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో అమరావతి కేంద్రాలు భారత్‌కు పెద్ద బలం కానున్నాయి.
వివరాలు
అందరికీ అందుబాటులో సదుపాయాలు
అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రిఫరెన్స్ సదుపాయాలు కేవలం టెస్టింగ్‌కే పరిమితం కావు. దేశంలోని పరిశోధకులు, స్టార్టప్‌లు, పరిశ్రమలు, యూనివర్సిటీలు, విద్యార్థులు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు పుస్తకాలలో మాత్రమే చదివిన క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు ఇకపై నేరుగా ప్రయోగాలు చేసే అవకాశం పొందుతున్నారు. ఇక్కడ 111 క్యూబిట్స్ వరకు క్వాంటమ్ ప్రాసెసర్లను పరీక్షించవచ్చు. భవిష్యత్తులో మిలియన్ క్యూబిట్స్ స్థాయికి టెస్టింగ్ సదుపాయాన్ని పెంచాలని క్యూబిట్ ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
క్రయోజెనిక్ టెక్నాలజీకి కొత్త దిశ
క్వాంటమ్ కంప్యూటర్లలో అత్యంత కీలకమైన అంశాల్లో క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు ముఖ్యమైనవి. ఇవి -273 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్లలో హీలియం-4 వాయువును వినియోగించి-269 నుంచి -272 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నారు. హీలియం-3 వాయువు చాలా అరుదుగా లభిస్తుంది. ప్రస్తుతం ఇది దేశంలోని రక్షణ పరిశోధన సంస్థల దగ్గరే ఉంది. అమరావతిలో ఏర్పాటైన క్రయోజెనిక్, ప్రిసిషన్, ఎలక్ట్రానిక్స్ సదుపాయాలు కేవలం క్వాంటమ్‌కే కాకుండా రక్షణ, ఆరోగ్యం, సెమీకండక్టర్ రంగాలకు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎంఆర్‌ఐ యంత్రాలు, అంతరిక్ష రంగంలో క్రయోజెనిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుండగా, ప్రిసిషన్ ఎలక్ట్రానిక్స్ రాడార్, డిఫెన్స్ సిస్టమ్స్‌కు కీలకం. క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలు సెమీకండక్టర్ పరిశ్రమకు బలాన్నిస్తాయి.
వివరాలు
ప్రముఖ సంస్థల భాగస్వామ్యం
దేశంలోని పలు నగరాల నుంచి క్వాంటమ్ విడిభాగాలను అమరావతికి తీసుకొచ్చి క్యూబిట్ ఫోర్స్ సంస్థ అసెంబుల్ చేస్తోంది. టీఐఎఫ్‌ఆర్, ఐఐఎస్‌సీ సంస్థలు ప్రాసెసర్‌లను తయారు చేశాయి. డీఆర్‌డీఓ పుణె ల్యాబ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్‌ను అందించింది. ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్, క్యూబిట్ ఫోర్స్ సంస్థలు డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లను తయారు చేశాయి. క్యూట్ ఎలక్ట్రానిక్స్ కరెంట్, వోల్టేజ్ సోర్సులను అందించగా, దిమిరా సంస్థ ఫ్లెక్స్ కేబుళ్లు, క్రయోజెనిక్ వైరింగ్‌ను సమకూర్చింది. మొత్తం సిస్టమ్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ బాధ్యతలను క్యూబిట్ ఫోర్స్ నిర్వహిస్తోంది.