Page Loader
దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు 
నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. దేశంలోనే తొలిసారి

దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
08:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కారిడార్‌ను కేంద్రం నిర్మించబోతోంది. ఇందుకోసం ఈశాన్య భారత్ లోని అస్సాంను వేదికగా చేసుకోనుంది. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదీ కింద రెండు వేర్వేరు టన్నెల్స్ డిజైన్ సిద్ధం చేశామని అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ వెల్లడించారు. వీటిలో ఒకదానిపై రైళ్లు, మరొకదానిపై వాహనాలు నడుస్తాయన్నారు. అస్సాంలోని నుమాలిఘర్, గోపురంలను కలుపుతూ మొదటి అండర్‌ వాటర్‌ రైల్‌రోడ్ టన్నెల్‌ నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రం సహకారంతో బ్రహ్మపుత్ర నదిలోపల దీన్ని నిర్మిస్తామని సీఎం చెప్పారు. రూ.6000 కోట్లతో తన హయాంలోనే ఈ టన్నెల్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.

DETAILS

సొరంగం నిర్మాణంతో 220 కిలోమీటర్ల ప్రయాణం, 33 కిలోమీటర్ల దూరంగా తగ్గనుంది :  సీఎం

బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై కేంద్రం తమను సంప్రదించిందని సీఎం బిస్వాశర్మ తెలిపారు. ఉత్తరాదిలో పర్వతాల లోపల నుంచి అటల్ సొరంగాన్ని ఎలా నిర్మించారో, బ్రహ్మపుత్ర కింద సొరంగాన్ని అలాగే నిర్మించనున్నామన్నారు. ఈ సొరంగం నిర్మాణం తర్వాత నుమలిగడ్డ - గోపురం మధ్య దూరం కేవలం 33 కిలోమీటర్లు కానుందన్నారు. దీనికి ముందు 220 కిలోమీటర్లతో ప్రయాణం దూరాభారం అయ్యేదని, 6 గంటల సమయం పట్టేదన్నారు. నీటి అడుగున సొరంగం ఏర్పాటుతో కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. సొరంగం 35 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాలను ఒకటిగా చేర్చే ప్లాన్ ను ప్రధాని మోదీ ఇప్పటికే ఆమోదించడం గమనార్హం.