Page Loader
మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ
మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి ప్రతిపక్ష నేత పిలుపు

మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ

వ్రాసిన వారు Stalin
Dec 30, 2022
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాల్దీవులోని భారత హైకమిషన్‌పై దాడికి ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అబ్బాస్ ఆదిల్ రిజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు దేశాలు అలర్ట్ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. అబ్బాస్ ఆదిల్ రిజా వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు బాగ్చీ పేర్కొన్నారు. మాల్దీవులలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఆదిల్ రిజా వ్యాఖ్యలను ఖండించినట్లు అరిందమ్ బాగ్చీ వివరించారు. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. మాల్దీవులోని భారత హైకమిషన్ అక్కడ ప్రభుత్వ భద్రతలో ఉన్నట్లు అరిందమ్ బాగ్చీ వివరించారు. భద్రతా పరంగా తాము కూడా అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

మాల్దీవులు

ఆ పార్టీ మొదటి నుంచి భారత్‌కు వ్యతిరేకమే..

ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ మొదటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగానే గళం వినిపిస్తోంది. ఈ పార్టీ నేత యామీన్ అధ్యిక్షుడిగా ఉన్నప్పుడు.. భారత్‍‌‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారు. చైనాతో కలిసి భారత్‌తో కయ్యానికి కాలు దివ్వారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేత అబ్బాస్ ఆదిల్ రిజా.. ఏకంగా భారత హైకమిషన్‌కు నిప్పు పెట్టాలని పిలుపునిచ్చారు. దీంతో ఆదేశంలోని ప్రజాస్వామ్య సంఘాలు, అధికార పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకమిషన్‌కు నిప్పు పెట్టాలని రిజా ఇచ్చిన పిలుపును మాల్దీవుల్లో అధికార పార్టీగా ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.