Most Wanted List: భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్టు.. బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ ఎదురుదెబ్బ!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో పట్టుబడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా జార్జియా (Georgia)లో వెంకటేష్ గార్గ్, అమెరికా (USA)లో భాను రాణాలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హరియాణా పోలీసులు కూడా పాల్గొన్నారు. విదేశాల్లో నుంచే నేరపూరిత కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ఇద్దరినీ త్వరలో భారత్‌కు తరలించనున్నట్లు సమాచారం. ఇందులో భాను రాణా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang)లో కీలక సభ్యుడని వెల్లడించారు.
Details
బీఎస్పీ నాయకుడి హత్యకేసులో వెంకటేష్ గార్గ్ నిందితుడు
హరియాణాలోని నారాయణ్‌గఢ్‌కు చెందిన వెంకటేష్ గార్గ్‌పై దేశవ్యాప్తంగా 10కిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్‌లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నాయకుడి హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడు. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల యువకులను తన క్రిమినల్ నెట్‌వర్క్‌లో చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్ (Kapil Sangwan)తో కలిసి దోపిడీలు, కాల్పులు వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత అక్టోబరులో ఢిల్లీలోని ఓ బిల్డర్ నివాసం, ఫామ్‌హౌస్‌పై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సంగ్వాన్ గ్యాంగ్‌లోని నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని అధికారులు వెల్లడించారు.
Details
అమెరికాలో పట్టుబడ్డ భాను రాణా
భాను రాణా హరియాణాలోని కర్నాల్‌కు చెందినవాడు. ఇతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు. హరియాణా, పంజాబ్, ఢిల్లీలో పలు నేర కార్యకలాపాల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి విచారణలో భాను రాణా పేరు వెలుగులోకి వచ్చినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆ దాడి భాను రాణా సూచనల మేరకే జరిగినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా, వారి వద్ద నుంచి గ్రెనేడ్లు, తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.