India's nuclear arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. అమెరికాకు చెందిన ఎఫ్‌ఏఎస్ నివేదిక వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్‌ఏఎస్) అంచనా వేసింది. లాభాపేక్షలేని ఈ సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదికలో భారత అణ్వాయుధ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి అందిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరించిన వివరాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు ఎఫ్‌ఏఎస్ తెలిపింది. 'ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్-2026' పేరుతో ఎఫ్‌ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఈ నివేదికను రూపొందించారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన అనంతరం భారత్ వద్ద సుమారు 190 అణు వార్‌హెడ్లు ఉండొచ్చని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అణ్వాయుధ వ్యవస్థల ఆధునీకరణ
ఇందులో ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన మరో 30 వార్‌హెడ్లు ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రయోగ వేదికలకు 160కి పైగా వార్‌హెడ్లు ఉండొచ్చని వివరించారు.
భారత్ తన అణ్వాయుధ సంపదను నిరంతరం ఆధునీకరిస్తోందని క్రిస్టెన్సన్ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో పలు కొత్త ఆయుధ వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలతోపాటు భూమి, గగనతలం నుంచి ప్రయోగించగల వ్యవస్థలను భారత్ మరింత బలోపేతం చేసుకుంటోందని వివరించారు.
పాత ఆయుధ వ్యవస్థల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెడుతోందని, మరికొన్ని వ్యవస్థలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
వివరాలు
225 అణ్వాయుధాలకు సరిపడా ప్లుటోనియం?
భారత్ వద్ద సైనిక అవసరాలకు వినియోగించగల ప్లుటోనియం నిల్వలు 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా ఉండొచ్చని కూడా క్రిస్టెన్సన్ అంచనా వేశారు.
భవిష్యత్తులో ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
2026 ఆరంభం నాటికి భారత్ వద్ద అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలు 730 కిలోల వరకు ఉండొచ్చని 'ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్' అంచనా వేసిన విషయాన్ని కూడా క్రిస్టెన్సన్ తన నివేదికలో ప్రస్తావించారు.
ఈ అంచనాలో సుమారు 170 కిలోల వరకు అటూఇటూ వ్యత్యాసం ఉండొచ్చని తెలిపారు.
వివరాలు
'ముందుగా అణ్వాయుధ ప్రయోగం చేయం'
ఇదిలా ఉండగా, భారత్ 1998లో పొఖ్రాన్-2 ఆపరేషన్‌లో భాగంగా అణు పరీక్షలు నిర్వహించింది.
అనంతరం శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించబోమనే విధానాన్ని ప్రకటించింది.
ఈ విధానానికి భారత్ కట్టుబడి ఉందని క్రిస్టెన్సన్ గుర్తుచేశారు.
అణ్వాయుధాల సంఖ్యను పెంచడంతోపాటు వాటి సామర్థ్యాన్ని ఆధునీకరిస్తున్నప్పటికీ, 'ముందుగా అణ్వాయుధ ప్రయోగం చేయరాదు' అనే విధానం భారత అణు వ్యూహంలో కీలక అంశంగా కొనసాగుతోందని నివేదిక సూచించింది.