CJP Protest: ఐక్యరాజ్యసమితికి భారత్ కౌంటర్.. మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సందర్భంగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN)మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐరాస చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, భారత అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. దిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు, రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు, జర్నలిస్టులను ముందస్తుగా, నిరసనల సమయంలో అరెస్ట్ చేయడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR)ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ (Permanent Mission of India) ఎక్స్ (X) వేదికగా తన స్పందనను వెల్లడించింది.
వివరాలు
అనవసర జోక్యం వద్దు
భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని భారత్ స్పష్టం చేసింది.
స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా, బలమైన సంస్థాగత వ్యవస్థలు ఈ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని పేర్కొంది.
ఢిల్లీ నిరసనలపై ఐరాస వ్యక్తం చేసిన ఆందోళనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యానికి సమానమని కౌంటర్ ఇచ్చింది.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న భారీ నిరసనలపైనా ఐక్యరాజ్యసమితి ఇదే స్థాయిలో దృష్టి సారించాలని భారత్ సూచించింది.
అన్ని అంశాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన తన బాధ్యతను, నిర్దేశిత కార్యాచరణ పరిధిని (Mandate) ఐరాస గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.
వివరాలు
ప్రజల హక్కులకు రాజ్యాంగ రక్షణ: భారత్
భారత ప్రజాస్వామ్య విలువలను ప్రస్తావిస్తూ.. దేశ ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని భారత్ మరోసారి వెల్లడించింది.
అయితే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టప్రకారం కొన్ని సహేతుకమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని వివరించింది.
దేశంలోని అధికార యంత్రాంగం చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తుందని పేర్కొంది.
ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే న్యాయం పొందేందుకు భారత న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది.
రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సంస్థాగత వ్యవస్థలు, న్యాయపరమైన విధానాలు పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన మార్గాలను అందిస్తున్నాయని భారత్ స్పష్టం చేసింది.
వివరాలు
నిరసనకారులను విడుదల చేయాలని ఐరాస డిమాండ్
మరోవైపు ఢిల్లీలో జరిగిన నిరసనలకు సంబంధించి పెద్ద సంఖ్యలో వ్యక్తులను అరెస్ట్ చేయడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఐరాస మానవ హక్కుల అధికార ప్రతినిధి తమీమ్ అల్-ఖెతాన్ స్పందించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నిరసనలపై విధించే ఆంక్షలు తప్పనిసరిగా అవసరమైనవిగా, పరిస్థితులకు తగిన విధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే సమయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులు అత్యంత సంయమనం పాటించాలని సూచించారు.
వివరాలు
సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలి
అంతేకాకుండా, అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారందరినీ తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఐరాస కోరింది.
నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు భారత అధికారులు వారితో అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించింది.
మొత్తంగా ఢిల్లీ నిరసనల సందర్భంగా జరిగిన అరెస్టులపై ఐరాస వ్యక్తం చేసిన ఆందోళనకు భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.
దేశంలో శాంతియుత నిరసనలకు రాజ్యాంగ రక్షణ ఉందని, చట్టబద్ధమైన వ్యవస్థలు పౌరుల హక్కులను కాపాడుతున్నాయని స్పష్టం చేసింది.
మరోవైపు నిరసనకారుల హక్కులను గౌరవించాలని, అక్రమ నిర్బంధాలను తొలగించి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని ఐరాస భారత అధికారులను కోరింది.