Loading...
Nitin Gadkari: ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ
ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

Nitin Gadkari: ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి కారణంగా సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. అంటే సగటున ప్రతి గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 66 శాతం మంది యువత ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

వివరాలు 

హెల్మెట్ లేకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటి

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టానికి ప్రధాన కారణంగా మారుతోందని గడ్కరీ తెలిపారు.

గత ఏడాది హెల్మెట్ ధరించకపోవడం వల్ల 54,132 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

అదే సమయంలో వాహనదారులు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని, రహదారిపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని గడ్కరీ సూచించారు.

డ్రైవింగ్‌లో చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి జీవితాన్నే మార్చే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

వివరాలు 

ప్రజల్లో అవగాహన మరింత అవసరం

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు.

వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించడం, అతివేగానికి దూరంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వంటి జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తెలిపారు.

రహదారి భద్రత విషయంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించినప్పుడే విలువైన ప్రాణాలను కాపాడగలమని గడ్కరీ స్పష్టం చేశారు.

ADVERTISEMENT