Nitin Gadkari: ఇంధన స్వయం సమృద్ధికి 100 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యం: నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్‌లో దేశం ఇంధన రంగంలో పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించాలంటే 100 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇంధన అవసరాల్లో విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రస్తుతం ఇంధన అవసరాల్లో సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని గడ్కరీ తెలిపారు.
వివరాలు
ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి
ఈ దిగుమతుల కోసం దేశం ప్రతి సంవత్సరం సుమారు రూ.22 లక్షల కోట్లను వెచ్చిస్తోందన్నారు. ఈ భారీ ఖర్చును తగ్గించాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇథనాల్ వినియోగాన్ని విస్తరించడంతో పాటు చెత్త నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి వంటి ఆధునిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై నడిచే వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
ఇథనాల్ మిశ్రమం వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలను ఖండించిన గడ్కరీ
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను గడ్కరీ ఖండించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా నిజాలను గ్రహించాలని సూచించారు. అలాగే ఆటోమొబైల్ సంస్థలు వాహనాల ధరలకే పరిమితం కాకుండా, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుకూలంగా పనిచేసే నాణ్యమైన ఇంజన్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.