Priyanka Gandhi: బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సమస్యపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్‌లపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం గళం విప్పాలని కోరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ, విజయ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు సెల్యూట్ చేస్తూ, అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
ప్రియాంక గాంధీ బ్యాగ్ పై 'పాలస్తీనా'
తూర్పు పాకిస్థాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) స్వతంత్ర దేశంగా ప్రకటించడంలో ఇందిరాగాంధీ చరిత్రాత్మక పాత్రను ఆమె ప్రశంసించారు. ఇక ప్రియాంక గాంధీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై 'పాలస్తీనా' అని ఇంగ్లీష్‌లో రాసి ఉండడం విశేషం. ఈ బ్యాగ్ ద్వారా ప్రియాంక ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలస్తీనా ప్రజల పట్ల సంఘీభావం ప్రకటించారని విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు మరింత చర్చకు దారి తీసింది.
మైనార్టీల రక్షణకు తగిన చర్యలు
ఈ అరెస్టు మైనారిటీలపై దాడులకు మరో ఉదాహరణగా నిలిచింది. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి అక్కడి నాయకులతో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మల్టీ లెవల్ చర్చలు కొనసాగుతున్నాయి.