LOADING...
SJ-100 aircraft: భారత్‌లో విమానాల తయారీ.. హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం 
భారత్‌లో విమానాల తయారీ.. హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం

SJ-100 aircraft: భారత్‌లో విమానాల తయారీ.. హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానాలు,హెలికాప్టర్ల తయారీలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్‌ ఇప్పుడు పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల నిర్మాణ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే ఎస్‌జే-100 జెట్‌ విమానాల ఉత్పత్తి కోసం రష్యా సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (UAC) ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆ సంస్థ భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL)తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

వివారాలు 

ఎస్‌జే-100 తరహా సుమారు 200 చిన్న పరిమాణ విమానాలు అత్యవసరం

హెచ్‌ఏఎల్‌ ప్రకటించిన ప్రకారం,''భారత భూభాగంలో పూర్తిస్థాయి ప్రయాణికుల విమానం తయారీ ఇది మొదటిసారి జరగనుంది.ఇంతకుముందు 1961లో ఏవీఆర్‌ఓ హెచ్‌ఎస్‌-748 విమానాల ఉత్పత్తి ప్రారంభమై,ఆ ప్రాజెక్టు 1988లో ముగిసింది.రాబోయే దశాబ్దంలో దేశీయ రవాణా అవసరాలను తీర్చేందుకు ఎస్‌జే-100 తరహా సుమారు 200 చిన్న పరిమాణ విమానాలు అత్యవసరం. భారత పౌర విమానయాన రంగంలో స్వయం సమృద్ధి సాధనలో ఈ భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది'' అని పేర్కొంది. ఇక ఉడాన్‌ పథకంలో భాగంగా ఈ విమానాలు తక్కువ దూర ప్రయాణాలకు గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తాయని హెచ్‌ఏఎల్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా 16 ఎయిర్‌లైన్‌ సంస్థలు నడుపుతున్న ఎస్‌జే-100 విమానాలు

ఎస్‌జే-100 రెండు ఇంజిన్లతో కూడిన మధ్యతరహా ప్రయాణికుల విమానం. ఇది గరిష్ఠంగా 103 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. చిన్న దూరాల విమాన సర్వీసులకు ఇది ఎంతో అనుకూలం. అలాగే నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో ఆర్థికంగా లాభదాయకం. తాజా ఒప్పందం వల్ల హెచ్‌ఏఎల్‌కు దేశీయ అవసరాలకు తగిన విధంగా ఆధునిక ప్రయాణికుల విమానాలను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తోంది. ఇప్పటికే రష్యా సంస్థ సుమారు 200 ఎస్‌జే-100 విమానాలను నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా 16 ఎయిర్‌లైన్‌ సంస్థలు వాటిని సర్వీసులో నడుపుతున్నాయి.