Nagastra-2: శత్రు ట్యాంకులపై విరుచుకుపడే నాగాస్త్ర-2.. సైన్యానికి స్వదేశీ అస్త్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యానికి మరో స్వదేశీ ఆయుధ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన నాగాస్త్ర-2 ట్యాంకు విధ్వంసక డ్రోన్లను సైన్యానికి అందించింది. గాల్లో కొంతసేపు చక్కర్లు కొడుతూ శత్రువుల కదలికలను గుర్తించడం, సరైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆత్మాహుతి దాడితో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. పగలు, రాత్రి సమయాల్లోనూ నిఘా నిర్వహించేందుకు వీటిలో అత్యాధునిక కెమెరాలను అమర్చారు.
వివరాలు
60 నిమిషాల పాటు గాల్లో ఎగురుతూ..
నాగాస్త్ర-2లో 4 కిలోల బరువున్న శక్తిమంతమైన టాండమ్ షేప్డ్ ఛార్జ్ వార్‌హెడ్‌ను ఏర్పాటు చేశారు.
ఇది 650 మిల్లీమీటర్ల మందం కలిగిన ఉక్కు కవచాన్ని కూడా ఛేదించగలదని పేర్కొంటున్నారు.
దీంతో భారీ రక్షణ కవచం ఉన్న శత్రు యుద్ధ ట్యాంకులను సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు.
ఈ డ్రోన్ వరుసగా 60 నిమిషాల పాటు గాల్లో ఎగురుతూ లక్ష్యాల కోసం గాలించగలదు.
దాడి చేయకూడదని నిర్ణయించుకుంటే, 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పుడు తిరిగి వెనక్కి రప్పించి మరోసారి ఉపయోగించుకోవచ్చు.
అదే 'ఫైర్ అండ్ ఫర్గెట్' విధానంలో ప్రయోగిస్తే, 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను కూడా కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలదు.
వివరాలు
జామింగ్‌ను తట్టుకునే అత్యాధునిక సాంకేతికత
శత్రువుల ఎలక్ట్రానిక్ దాడులను ఎదుర్కొనేందుకు నాగాస్త్ర-2లో ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్స్ (ECCM)సాంకేతికతను పొందుపరిచారు.
శత్రు సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయడం,జీపీఎస్ సంకేతాలను అడ్డుకోవడం లేదా డ్రోన్ ప్రయాణ దిశను మార్చే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలను ఈ సాంకేతికత సమర్థంగా ఎదుర్కొనేలా రూపొందించారు.
ఇలాంటి అడ్డంకులు ఎదురైనా నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది.
నాగాస్త్ర-2ను భారతసైన్యం ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది.ఇదిలా ఉండగా,కొద్ది రోజుల క్రితమే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సైన్యానికి 450 నాగాస్త్ర-1ఆర్ లాయిటరింగ్ డ్రోన్లను అందించింది.
సైన్యానికి అవసరమైన స్వల్పశ్రేణి దాడి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ డ్రోన్లను రూపొందించారు.
స్వదేశీ రక్షణపరికరాల వినియోగాన్ని పెంచే క్రమంలో నాగాస్త్ర శ్రేణి డ్రోన్లు భారతసైన్యానికి ఉపయోగపడనున్నాయి.