Indian Army: భారత ఆర్మీ సిబ్బంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.. కానీ: ఆర్మీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత రక్షణ శాఖ తాజాగా తన వైఖరిలో కొంత మార్పు చేసింది. జవాన్లు, సైనిక అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను చూడటానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రక్షణ శాఖ వర్గాలను ఉదహరిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే, ఈ అనుమతితో పాటు కొన్ని కఠినమైన షరతులను కూడా అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ తాజా మార్పులకు సంబంధించి అన్ని సైనిక యూనిట్లకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ మార్గదర్శకాలను పంపినట్లు మీడియా పేర్కొంది. సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం సమాచారం తెలుసుకునే ఉద్దేశంతో మాత్రమే ఉపయోగించాలని ఆ సూచనల్లో స్పష్టం చేశారు.
వివరాలు
సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం లేదా నకిలీ పోస్టులు కనిపిస్తే..
పోస్టులు పెట్టడం, ఇతరుల పోస్టులకు కామెంట్లు చేయడం, షేర్ చేయడం, మెసేజ్‌లకు స్పందించడం వంటి చర్యలకు మాత్రం అనుమతి ఉండదని తేల్చిచెప్పారు. అంటే, ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం వీక్షించేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఎలాంటి ప్రతిస్పందనకు వీలు ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే తరహా నిబంధనలు ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా అమల్లో ఉన్నట్లు తెలిపారు. అలాగే, తమ సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం లేదా నకిలీ పోస్టులు కనిపిస్తే వెంటనే సీనియర్ అధికారులకు తెలియజేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. వీపీఎన్‌లు,నకిలీ వెబ్‌సైట్లు,వెబ్ ప్రాక్సీలు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సైనికులను మరోసారి హెచ్చరించారు.
వివరాలు
సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష
డిజిటల్ అవగాహనతో పాటు దేశ భద్రతకు ముప్పు తలెత్తకుండా సైనికులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సూచనల ద్వారా గుర్తుచేశారు. అలాగే, సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. హనీట్రాప్‌లు, డబ్బు ఆశ చూపించి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆర్మీ సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2020లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా మొత్తం 89 మొబైల్ యాప్‌లపై సైన్యం నిషేధం విధించింది. అయితే, ఆ తరువాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్‌ఇన్, టెలిగ్రామ్, వాట్సప్ వంటి యాప్‌లను పాక్షికంగా వినియోగించుకునే వెసులుబాటు సైనికులకు కల్పించింది.