Hormuz: హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ కెప్టెన్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారత్‌కు చమురు తీసుకొస్తున్న వాణిజ్య నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయ కెప్టెన్ ఆకస్మికంగా మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం గుండెపోటు కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ (43) 'అవానా' అనే చమురు నౌకకు కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఆయిల్‌తో భారత్‌కు బయలుదేరిన ఈ నౌక, ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధికి సుమారు 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రంజన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యసాయం అందించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
వివరాలు
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం
యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన మార్గంలో తరలింపు అనుమతులు లభించకపోవడంతో ఆయనను పడవ ద్వారా దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు తరలించారు. అక్కడే ఆయన మృతి చెందినట్లు సమాచారం. మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెలుగులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం అందించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్‌లకు లేఖ రాసినట్లు రంజన్ సోదరుడు తెలిపారు. రాకేశ్ రంజన్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.