Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. అత్యాచారం కేసులో హైకోర్టు దోషిగా తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. 2013లో తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గురువారం ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో 2021లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. కేసు వివరాల ప్రకారం.. 2013లో గోవాలో నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఓ హోటల్ ఎలివేటర్‌లో తరుణ్ తేజ్‌పాల్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అనంతరం అదే ఏడాది నవంబరులో పోలీసులు తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
వివరాలు
2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది
ఈ కేసు విచారణ 2017లో మాపుసా ట్రయల్ కోర్టులో ప్రారంభమైంది.
దీర్ఘకాల విచారణ అనంతరం 2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
అయితే ఆ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాలు చేసింది.
ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం తుషార్ మెహతా మాట్లాడుతూ.. తేజ్‌పాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోర్టును కోరారు.
బాధితురాలికి తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తి ఇలాంటి నేరానికి పాల్పడడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొన్నారు.
బాధితురాలు పలుమార్లు నిరాకరించినప్పటికీ ఆమె అభిప్రాయాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
వివరాలు
"ఒక మహిళ 'వద్దు' అంటే దాని అర్థం 'వద్దు'
"ఒక మహిళ 'వద్దు' అంటే దాని అర్థం 'వద్దు' అనే. ఈ అంశంపై సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లేలా కోర్టు తీర్పు ఉండాలి" అని ఆయన వాదించారు.
మరోవైపు, ఈ కేసులో తానే బాధితుడినని పేర్కొన్న తరుణ్ తేజ్‌పాల్ కోర్టును కనికరం చూపాలని అభ్యర్థించాడు.
ప్రస్తుతం తన వయస్సు 62 సంవత్సరాలని, తనకు భార్య ఉందని తెలిపాడు.
ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం తమకు ఉందని, రికార్డులో ఉన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని తనపై దయ చూపాలని కోర్టును కోరాడు.
ఈ కేసులో శిక్షపై తుది నిర్ణయాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయస్థానం ప్రకటించనున్నట్లు తెలిపింది.