'బూస్టర్ డోస్ త్వరగా తీసుకోండి'.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక
దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. రాబోయే రోజుల్లో కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్‌లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలని సూచించింది. పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు చెప్పింది. వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలు, అంతర్జాతీయ పర్యటనలకు వంటివి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని ఐఎంఏ సూచించింది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్‌లు వంటి ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని పేర్కొంది. బూస్టర్ డోస్‌ను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పింది. తద్వారా కోవిడ్ ఉద్ధృతిని తగ్గించవచ్చని ఐఎంఏ వివరించింది.
''డేల్టా' నాటి పరిస్థితులు రానివ్వొద్దు'
అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచడం ద్వారా 'డేల్టా' నాటి పరిస్థితులను నివారించవచ్చని కేంద్రానికి ఐఎంఏ సూచించింది. ఇదిలా ఉంటే.. చైనా నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను వెంటనే నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు లేవని, ప్రస్తుతం కనెక్టింగ్ ఫ్లైట్‌లు మాత్రమే నడుస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కనెక్టింగ్ ఫ్లైట్ల నిలిపివేతపై కేంద్రం ఎలాంటి ఉత్తర్వ్యులు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు.