త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలంలో ట్రక్కు డ్రైవర్లకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో వాహనాలను తయారు చేసే సమయంలోనే ట్రక్కుల డ్రైవర్ క్యాబిన్లలో ఎయిర్ కండీషనర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుందని గడ్కరీ సూచించారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయంపై మాట్లాడారు. ట్రక్ డ్రైవర్ కంపార్ట్‌మెంట్లలో ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి చేసే ఫైల్‌పై సంతకం చేసినట్లు చెప్పారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేసే ట్రక్కు డ్రైవర్ల న్యాయ పోరాటాన్ని గడ్కరీ గుర్తించారు. ఈ మేరకు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలి: గడ్కరీ
డ్రైవర్లు 43-47 డిగ్రీల కఠినమైన ఉష్ణోగ్రతల్లో వాహనాలను నడుపుతారని, డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని గడ్కరీ అన్నారు. తాను మంత్రి అయిన తర్వాత ఏసీ క్యాబిన్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ట్రక్కుల ధరలు పెరుగుతాయని కొందరు వ్యతిరేకించారని, కానీ అన్ని ట్రక్ క్యాబిన్‌లు ఏసీ క్యాబిన్‌లుగా ఉండాలనే ఫైల్‌పై తాను సంతకం చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై ట్రక్కు డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.