LOADING...
INS Mahe: నౌకాదళంలోకి  'సైలెంట్‌ హంటర్‌' ప్రవేశం.. 'ఐఎన్‌ఎస్‌ మాహె' విశేషాలివి..! 
నౌకాదళంలోకి 'సైలెంట్‌ హంటర్‌' ప్రవేశం.. 'ఐఎన్‌ఎస్‌ మాహె' విశేషాలివి..!

INS Mahe: నౌకాదళంలోకి  'సైలెంట్‌ హంటర్‌' ప్రవేశం.. 'ఐఎన్‌ఎస్‌ మాహె' విశేషాలివి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతూ మరో ఆధునిక ఆయుధం సేవల్లోకి వచ్చింది. యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌లలో తొలి నౌకగా నిలిచిన 'ఐఎన్‌ఎస్‌ మాహె' సోమవారం అధికారికంగా నేవీలో చేరింది. ముంబయి నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ ప్రధానాధికారి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అందించారు. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించిన ఈ నౌకలో 80 శాతం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించటం విశేషం. 'సైలెంట్‌ హంటర్‌' అనే పేరుతో గుర్తింపు పొందిన ఈ నౌక వెస్ట్రన్‌ సీబోర్డు పరిధిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది.

వివరాలు 

భారత నౌకాదళ అధిపత్యం

మలబార్‌ తీరంలోని చారిత్రక పట్టణం 'మాహె' పేరు ఈ నౌకకు పెట్టడం జరిగింది. దీని పైభాగంలో కలరిపయట్టులో ఉపయోగించే 'ఉరుమి' అనే దీర్ఘమైన, వంపుల కత్తి ప్రతిరూపాన్ని అమర్చారు. ఇది చురుకుదనం, నైపుణ్యం, యుద్ధ సామర్థ్యానికి సంకేతంగా భావిస్తారు. ఈ నౌక సేవల్లోకి రావడంతో తీర ప్రాంతాల్లో భారత నౌకాదళ అధిపత్యం మరింత బలపడనుంది. జలాంతర్గామి వేట, తీరరక్షణ, సముద్ర గర్భ నిఘా, రెస్క్యూ ఆపరేషన్లు వంటి విభాగాల్లో పనిచేసేలా దీన్ని ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారు.

వివరాలు 

ఐఎన్‌ఎస్‌ మాహె ప్రత్యేకతలు 

తక్కువ ధ్వనితో నీటిలో కదిలే ఈ వాటర్‌క్రాఫ్ట్‌ శత్రు జలాంతర్గాములకు దాదాపు కనిపించకుండా పని చేస్తుంది. అందుకే దీన్ని'సైలెంట్‌ హంటర్‌' అని పిలుస్తున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోనార్‌ సిస్టమ్‌ నౌకకు కళ్లూ,చెవుల్లా పనిచేస్తుంది. శత్రు సబ్‌మెరైన్లు, నీటిలో ఉన్న మైన్స్‌,ఇతర ప్రమాదాలను చురుకు నిగ్గుతో గుర్తిస్తుంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 'అభయ్‌'హల్‌-మౌంటెడ్‌ సోనార్‌ వ్యవస్థ ఈ నౌకకు పెద్ద ప్లస్‌. చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలను నిరంతరం గమనిస్తూ జలాంతర్గాముల కదలికలను సులభంగా గుర్తిస్తుంది. లో-ఫ్రీక్వెన్సీ వేరియబుల్‌ డెప్త్‌ సోనార్‌ సాయంతో ఇది సముద్ర గర్భంలోని లోతైన ప్రాంతాలకూ నిఘా వేసే శక్తి కలిగి ఉంది. నౌక నుంచి దిగే కేబుల్‌ ద్వారా శత్రు ముప్పులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఐఎన్‌ఎస్‌ మాహె ప్రత్యేకతలు 

ఆయుధ సామర్థ్యాల్లో ఐఆర్‌ఎల్‌ యాంటీ-సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంచర్, 30 మిల్లీమీటర్ల నావెల్‌ సర్ఫేస్‌ గన్, అడ్వాన్స్‌డ్‌ ట్రిపుల్‌ లైట్‌వెయిట్‌ టార్పెడో లాంచర్, యాంటీ-సబ్‌మెరైన్‌ మైన్స్, 12.7 మిల్లీమీటర్ల రిమోట్‌ కంట్రోల్‌ గన్ వంటి పరికరాలు ఉన్నాయి. తక్కువ లోతు ఉన్న సముద్ర ప్రాంతాల్లో కూడా వేగంగా, అచ్చం లక్ష్యాన్ని చేరుకునేలా ఇది రూపొందించడం జరిగింది. నౌక పొడవు 78 మీటర్లు ఉండటం దీని స్థిరత్వాన్ని, వేగాన్ని పెంచుతుంది. గరిష్టంగా 25 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగల ఈ నౌక అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం 57 మంది సిబ్బంది దీనిపై పనిచేస్తారు. వీరిలో 7 మంది అధికారులు, మిగతా 50 మంది నావికులు.