Indian Navy: భారత నౌకాదళం మెరుపు ఆపరేషన్.. సముద్రపు దొంగల చెర నుంచి 20 మందికి విముక్తి
ఈ వార్తాకథనం ఏంటి
అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చేతికి చిక్కిన ఇరాన్‌కు చెందిన చేపల వేట నౌకను భారత నౌకాదళం సురక్షితంగా విడిపించింది. సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా దూరంలో 48 గంటల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో నౌకలోని 20 మంది సిబ్బందిని రక్షించింది. నవంబర్ 2న ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. భారత నౌకాదళంతో పాటు భారత వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది.
వివరాలు
48 గంటల పాటు సాగిన ఆపరేషన్
సాయుధ సముద్రపు దొంగలు ఇరాన్‌కు చెందిన 'అజిని' అనే చేపల వేట నౌకను హైజాక్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగింది. తొలుత దొంగల చెరలో ఉన్న నౌక ఆచూకీని గుర్తించింది.
ఆ తర్వాత నౌకను అడ్డుకుని, అందులో ఉన్న 20 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ 48 గంటల పాటు కొనసాగింది.
వైమానిక దళం కీలక సహకారం
ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం కూడా నౌకాదళానికి అండగా నిలిచింది. హైజాక్‌కు గురైన నౌకను గుర్తించడం,అడ్డుకోవడం,అందులోని సిబ్బందిని సురక్షితంగా రక్షించడం వంటి చర్యలను రెండు దళాలు సమన్వయంతో చేపట్టాయి.
వివరాలు
నౌకను ఎక్కడ హైజాక్ చేశారు?
సాయుధ సముద్రపు దొంగల నుంచి సిబ్బందిని కాపాడిన నౌకాదళం చొరవను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
అక్టోబర్ 29న ఈ చేపల వేట నౌకను ఈశాన్య సోమాలియా తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు సమాచారం.
బందర్ బయ్లా, హఫున్ పట్టణాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ విషయాన్ని పంట్లాండ్ మారిటైమ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఓ సముద్ర భద్రతా అధికారి అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థకు వెల్లడించారు.
వివరాలు
సముద్ర భద్రతకు భారత్ కట్టుబాటు
హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర మార్గాల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
సముద్రపు దొంగల ముప్పు నుంచి నావికులను రక్షించడంతో పాటు, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
భారత తీర ప్రాంతాలకు దూరంగా ఉన్న సముద్ర ప్రాంతాల్లోనూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం భారత నౌకాదళానికి ఉందని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.