LOADING...
PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?
ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?

PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా రెండు దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనలో ప్రధానంగా డిసెంబర్ 14, 15 తేదీల్లో మయామిలో జరగనున్న జీ20 దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా తన 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా 2009 తర్వాత తొలిసారిగా జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశం ట్రంప్ నేషనల్ డోరల్ మయామిలో నిర్వహించే అవకాశముంది. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఇప్పటికే ప్రధాని మోదీకి అధికారిక ఆహ్వానం పంపినట్లు ధృవీకరించారు.

వివరాలు 

అమెరికా పర్యటనలో వాణిజ్యం,సాంకేతికత వంటి అంశాలతో పాటు పలు అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం,సాంకేతికత వంటి అంశాలతో పాటు పలు అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. అలాగే ఒమాన్ తీరంలో అమెరికా సైన్యం జరిపిన చర్యల్లో భారతీయ నావికులు మృతి చెందిన ఘటనను కూడా భారత్ ప్రస్తావించింది. అయితే ఆ నౌకలు ఇరాన్ నుంచి చమురును తరలించే షాడో ఫ్లీట్‌లో భాగమని అమెరికా సైన్యం పేర్కొంది. ప్రధాని మోదీ,అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని అమెరికా రాయబారి సెర్జియో గోర్ పలుమార్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌ను సందర్శించే అవకాశముందని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.

వివరాలు 

భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం

యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF) సమావేశంలో మాట్లాడుతూ క్వాడ్ శిఖరాగ్ర సమావేశం నిర్వహణపై ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు రావచ్చని తెలిపారు. భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని అమెరికా భావిస్తుండగా,సుంకాల విషయంలో భారత్‌కు పోటీదారులపై అనుకూలమైన పరిస్థితులు ఉండేలా ఢిల్లీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక కెనడా పర్యటన విషయంలో భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చర్చల్లో పురోగతి కీలకంగా మారనుంది. గత ఏడాది చివర్లో ప్రారంభమైన ఈ చర్చల ద్వారా 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

వివరాలు 

కెనడా పర్యటనకు ప్రధాని మోదీని ఆహ్వానించిన మార్క్ కార్నీ

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కూడా భేటీ అయ్యారు. సీఈపీఏ చర్చలు వేగంగా సాగుతున్నాయని ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే ఒప్పందాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా కెనడా పర్యటనకు మార్క్ కార్నీ ప్రధాని మోదీని ఆహ్వానించారు. గత ఏడాది నుంచి భారత్-కెనడా సంబంధాలు మళ్లీ మెరుగుదల దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం,పెట్టుబడులు,కీలక ఖనిజాలు,పునరుత్పాదక ఇంధన రంగం,విద్య, ప్రజల మధ్య సంబంధాల అభివృద్ధిపై రెండు దేశాలు దృష్టి సారించాయి. కెనడాకు చెందిన కామెకో సంస్థ, భారత అణుశక్తి విభాగం మధ్య కుదిరిన యురేనియం సరఫరా ఒప్పందం కూడా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసింది.

Advertisement