LOADING...
Korean Queen: అయోధ్యలో కొరియా రాణి విగ్రహావిష్కరణ వెనుక ఉన్న కథ..
అయోధ్యలో కొరియా రాణి విగ్రహావిష్కరణ వెనుక ఉన్న కథ..

Korean Queen: అయోధ్యలో కొరియా రాణి విగ్రహావిష్కరణ వెనుక ఉన్న కథ..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల అయోధ్యలో దక్షిణ కొరియాకు చెందిన రాణి హెయో వాంగ్‌-ఓక్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె వంశపారంపర్య గౌరవార్థం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన ఒక రాణికి మన ప్రాచీన నగరం అయోధ్యకు సంబంధం ఏమిటి అనే సందేహం సహజమే. ఆశ్చర్యకరంగా, వాంగ్‌-ఓక్‌ (సురిరత్నగా కూడా పిలుస్తారు) జన్మస్థలం శ్రీరాముడు అవతరించిన అయోధ్యేనని అక్కడి ప్రధాన తెగ ఒకటి విశ్వసిస్తోంది. ఈ విశ్వాసానికి ప్రతీకగా సరయూనది తీరంలో ఆమె స్మరణార్థంగా ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించడం విశేషంగా నిలిచింది.

వివరాలు 

ఎవరీ సురి రత్న..? 

చారిత్రక కథనాల ప్రకారం,సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే క్రీ.శ. 48లో అప్పటి అయోధ్య రాజుకు ఒక దివ్య స్వప్నం వచ్చిందని చెబుతారు. తన కుమార్తె సురి రత్నను కొరియా దేశానికి చెందిన రాజు కిమ్‌ సురో (King Kim Suro)తో వివాహం చేయాలని దేవుడు ఆదేశించినట్లు ఆ కలలో కనిపించిందట. తండ్రి ఆదేశానికి లోబడి సురి రత్న వేల కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసి కొరియాకు చేరుకొని కిమ్‌ సురోను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పది మంది సంతానం కలిగింది. వారు సుమారు 150సంవత్సరాలు జీవించినట్లు చరిత్రకారుల అంచనా. గయ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈ రాజదంపతులు భారతీయ సంస్కృతి, బౌద్ధ సంప్రదాయాలను విస్తృతంగా వ్యాప్తి చేశారని ప్రచారంలో ఉంది.

వివరాలు 

మెమోరియల్‌ పార్క్‌ ..

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగరపాలక సంస్థ కలిసి 2001లో సరయూనది ఒడ్డున రాణి సురి రత్న పేరుతో ఒక స్మారకాన్ని నిర్మించారు. అనంతరం కొరియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఇటీవల కాలంలో ఈ స్మారకాన్ని మరింత విస్తరించి, ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారు. 2018లో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌-సూక్‌ భారతదేశ పర్యటన సందర్భంగా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ మెమోరియల్‌ పార్కును అధికారికంగా ప్రారంభించారు. రాణి చేసిన సముద్రయానాన్ని ప్రతీకాత్మకంగా చూపించేలా పార్కులో ఒక చిన్న కొలను ఏర్పాటు చేయడం మరో విశేషం.

Advertisement

వివరాలు 

లక్షలాది వారసులు..

తాము రాణి సురి రత్న వారసులమని, తమ మూలస్థానం అయోధ్యేనని పేర్కొనే కరక్‌ తెగకు చెందిన సుమారు 60 లక్షల మంది దక్షిణ కొరియాలో ఉన్నట్లు అంచనా. తమ రాణి జన్మభూమిగా భావించే అయోధ్యను సందర్శించడం ఈ తెగవారికి ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి ఏడాది వారు అయోధ్యకు వస్తుంటారు. ఈ ఏడాది మార్చి నెలలో కూడా 70 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం అయోధ్య రామాలయాన్ని దర్శించి, సరయూనది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొంది.

Advertisement