LOADING...
Indian vlogger detained in China:అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు..  చైనాలో 15గంటలపాటు భారత ట్రావెల్‌ వ్లాగర్‌ను నిర్బంధం..  

Indian vlogger detained in China:అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు..  చైనాలో 15గంటలపాటు భారత ట్రావెల్‌ వ్లాగర్‌ను నిర్బంధం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశంపై మాట్లాడిన కారణంగానే తనను చైనా అధికారులు అదుపులోకి తీసుకున్నారని భారత ట్రావెల్‌ వ్లాగర్‌ అనంత్‌ మిత్తల్‌ ఆరోపించారు. ఈ నెల 16న జరిగిన ఘటనను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియో రూపంలో వెల్లడించారు. 'ఆన్‌రోడ్‌ ఇండియా' పేరుతో ట్రావెల్‌ వీడియోలు చేసే అనంత్‌,ఈ అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఇటీవల ఒక స్నేహితుడిని కలిసేందుకు చైనాకు వెళ్లినట్లు అనంత్‌ చెప్పారు. గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఓ సీనియర్‌ అధికారి తనను పక్కకు తీసుకెళ్లారని వివరించారు. అక్కడ ప్రత్యేక ప్రాంతంలో కూర్చోబెట్టారని,తనతో పాటు దక్షిణ కొరియా, బంగ్లాదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

వివరాలు 

కెమెరా, మొబైల్‌ ఫోన్ల స్వాధీనం

సుమారు 15 గంటల పాటు తనను నిర్బంధించి ప్రశ్నలు అడిగారని తెలిపారు. నిర్బంధ సమయంలో తన లగేజీని పూర్తిగా తనిఖీ చేసి, కెమెరా, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని అనంత్‌ చెప్పారు. ఆ సమయంలో కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని, భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడేందుకు అనుమతి కల్పించలేదని ఆరోపించారు. విచారణ పూర్తైన తర్వాతే తనను విడుదల చేశారని తెలిపారు. ఈ సంఘటన తనపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించిందని వాపోయారు.

వివరాలు 

అరుణాచల్‌ గురించి మాట్లాడానంతే…

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు నిర్బంధించిన ఘటనను గుర్తు చేస్తూ, తాను కూడా ఆ రాష్ట్రంలో మూడేళ్లు చదువుకున్నానని అనంత్‌ తెలిపారు. ఆ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పట్లో వీడియో చేసినట్లు చెప్పారు. అదే కారణంగా ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని చైనా అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అనంత్‌ వీడియోపై భారత్‌ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదని తెలుస్తోంది.

Advertisement